వేడి టీతో కేన్సర్!
పారిస్: వేడి వేడి చాయ్ నోట్లో పోసుకోకుంటే చాలా మందికి రోజు మొదలుకాదు. అయితే వేడి టీని ఇష్టంగా తాగేవారికి ఒక దుర్వార్త. చల్లగా టీ తాగే వారిలో కంటే వేడిగా టీ తాగేవారికి గొంతు కేన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని తాజా అధ్యయనాన్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్ శుక్రవారంనాడు ప్రచురించింది. ఇసోఫాగస్ కేన్సర్ ఇప్పటివరకు ముఖ్యంగా ధూమపానం, ఆల్కహాల్ తాగేవారికే వస్తుందని శాస్త్రవేత్తల నమ్మకం. అయితే వేడి పానీయాలు తాగేవారికి కూడా గొంతు కేన్సర్ వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
వేడి పానీయాలు గొంతులోని కణజాలాన్ని ధ్వంసం చేయడంతో కేన్సర్ వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచంలోనే ఇసోఫాజియల్ కేన్సర్ బాధితులు అధికంగా ఉన్న గొలెస్తాన్ ప్రొవిన్స్ ను ఇరానియన్ పరిశోధకులు సందర్శించారు. ఆ ప్రాంతంలోని వారు వేడి బ్లాక్ టీని పెద్ద ఎత్తున సేవిస్తారు. రోజుకు ఒక వ్యక్తి ఒక లీటర్ పైగా వేడి టీని సేవిస్తాడు. అయితే ఆ ప్రాంతం వారు పొగాకు, ఆల్కహాలును తక్కువగా వాడుతున్నారు. ఈ అధ్యయనానికి టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని డైజెస్టివ్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన రెజా మాలెక్జెదా బృందం ఆ ప్రాంతంలో గొంతులో ట్యూమర్లు వచ్చిన 300 మందిని అధ్యయనం చేసింది. అదే సమయంలో అలాంటి అలవాట్లు ఉన్న ఆరోగ్యవంతలు 571 మందితో వారిని సరిపోల్చి అధ్యయనం చేశారు.
65-69 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత కల్గిన టీని తాగిన వారిలో 65 సెంటీగ్రేడ్ డిగ్రీలు అంతకంటే తక్కువ వేడి టీని తాగిన వారిలో కంటే కేన్సర్ వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అదే 70 సెంటీగ్రేడ్ డిగ్రీల వేడితో టీ తాగే వారికి 8 రెట్లు కేన్సర్ ప్రమాదమున్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. వేడి పానీయాలు గొంతుకు సంబంధించిన ఎపిథెలియల్ లైనింగ్ ను దెబ్బ తీస్తుంది. దాంతో కేన్సర్ వచ్చే ప్రమాదముందని లాన్సెట్ సంపాదకీయం పేర్కొంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇదమిద్ధంగా తెలియడం లేదు. అయితే ఈ అధ్యయనంతో పెద్ద ఎత్తున భయపడవలసిన అవసరం లేదని ఆ అధ్యయనం పెర్కొంది.గతంలోని బ్రిటన్ అధ్యయనాలు 56-60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్టోగ్రతలో పానీయాలు తాగడం మంచిదని తెలిపాయి. అప్పుడే కాచిన టీని తాగేందుకు టీ ప్రియులు దాదాపు నాలుగు నిమిషాలు వేచి ఉండవలసిన అవసరముందని ఆ అధ్యయనం తెలిపింది.
News Posted: 27 March, 2009
|