పార్టీలకు తాత్కాలిక వర్కర్లు
నాగపూర్ : ఆర్థిక మాంద్యం ఉద్యోగాలకు ఎసరు పెడుతుండడంతో ఎన్నికలు తాత్కాలిక ఉద్యోగాల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. శ్రామికులు పార్ట్ టైమ్ పార్టీ మద్దతుదారులుగా ర్యాలీలకు హాజరవుతూ మరొకవైపు డబ్బు సంపాదిస్తున్నారు. వారు చేసేది కొన్ని గంటల పని. కాని అటు పార్టీకి కూడా అవసరం తీరుతుంది. దీనితో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటున్నారు.
26 సంవత్సరాల గజానన్ ఉయికె నిరుద్యోగి అయిన యువకుడు. అతను ఒక పార్టీ పతాకం చేత పట్టుకుని తిరుగుతాడు. కాని ఆ పార్టీ అభ్యర్థి పేరు మాత్రం అతనికి తెలియదు. ఎందుకంటే గజానన్ దృష్టి డబ్బుపైనే కాని రాజకీయాలపై లేదు. 'నేను ఈ పని చేసినందుకు నాకు 60 రూపాయలు లభిస్తాయి' అని గజానన్ చెప్పాడు.
మండే వేసవిలో రాజకీయ పార్టీలకు జనం కావాలి. భవన నిర్మాణ కూలి అయిన సిద్ధార్ధ పంటవనె వంటి వారికి తేలికగా డబ్బు లభించే పని కావాలి. 'ఇది రెండు గంటల పని. అక్కడకు వెళ్ళి, కూర్చొని, ప్రసంగాలు విని వంద రూపాయలతో తిరిగి రావచ్చు. అంతా సరదాగా ఉంటుంది' అని సిద్ధార్ధ అన్నాడు.
కాగా, తారాచంద్ బంటెకి ఈ రోజులలో డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. అతను తాత్కాలిక రాజకీయ కార్యకర్తలను సమకూరుస్తుంటాడు. ఇది ప్రతి ఒక్కరికీ లాభించే పరిస్థితి అని అతను పేర్కొంటాడు. 'నా వద్ద ఈ ప్రాంతంలో 100 మంది కూలీలు ఉన్నారు. మిగిలినవారు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. ర్యాలీలు, పాదయాత్ర, మోర్చాల కోసం వారి అవసరం ఉంటుంది. మనిషికి రూ. 150 లభిస్తుంది. నాకు నా కమీషన్ గా రూ. 50 నుంచి రూ. 60 వరకు లభిస్తుంది' అని తారాచంద్ తెలియజేశాడు.
ఇక్కడ విధేయత ప్రధానం కాదు. చాలా మంది శ్రామికులు వివిధ ర్యాలీలకు హాజరవుతుంటారు. డబ్బు కిట్టుతుండేంత వరకు ఏ పార్టీకైనా మద్దతుగా వారు గొంతు లేపగలరు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, ముఖ్యంగా బ్యాలట్ పెట్టె సంఖ్యాధిక్యానికి సంబంధించినదే కదా.
News Posted: 30 March, 2009
|