ఒక్క దెబ్బకు 5 జబ్బులు!
న్యూఢిల్లీ: బిపి, మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బు, థూమపాన సమస్యల్లాంటి అయుదు రకాల రుగ్మతలను తగ్గించే మందులతో కొత్త రకం మాత్రలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యల్ని నివారించే మందులతో కూడిన ఒకే ఒక మాత్ర అందుబాటులోకి రానున్నడం అద్భుతమైన విషయం. ఈ రకం టాబ్లెట్లు తమ మొదటి దశ ప్రయోగాలు విజయవంతమైనాయి. శాస్త్రవేత్తలు ఈ పిల్ ను 'పాలీ పిల్' అని పిలుస్తారు. కొలెస్ట్రాల్ ను తగ్గించే 'స్టాటిన్', 'ఆస్ప్రిన్' తో పాటు బిపిని తగ్గించే మరో మూడు రకాల మందులను కలపి మొత్తం 5 రకాల మందులతో ఈ టాబ్లెట్స్ ను రూపొందించారు. ఈ మందులు ఆయా ప్రత్యేక రుగ్మతలను తగ్గించడంలో చాలా శక్తివంతమైనప్పటికీ, వీటన్నిటిని కలిపి వాడటం వలన ఎలాంటి దుష్పరిణామాలుండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గుండె జబ్బుల ప్రమాదమున్నట్లు కనుగొన్నవారు, గుండె జబ్బులతో బాధపడే రోగులు ఈ పాలీ పిల్స్ వాడటం శ్రేయస్కరమని భారత-కెనడా శాస్త్రవేత్తల బృందం 'లాన్ సెట్' మెడికల్ జర్నల్ లో ప్రకటించింది. అయిదు రకాల మందులను విడివిడిగా వాడటం కంటే, ఒకే టాబ్లెట్ లో అయిదు రకాల మందులున్న ఇలాంటి మాత్రలను వాడటం మంచిదని ఆ బృందం తెలిపింది. బిపి, మధుమేహం, ఊబకాయం లేదా ధూమపాన రుగ్మతల్లో ఏదో ఒకటి కలిగి, గుండె జబ్బులు లేని 48-50 ఏళ్ల వయసున్న 2,053 ప్రజల్లో ఈ పాలీ పిల్స్ ను విజయంవంతంగా పరీక్షించారు. పై అయిదు రుగ్మతల్లో ఒకేఒక రుగ్మత మాత్రమే కలిగిన వారు ఈ మందులు వాడితే వారిలో గుండె జబ్బు కలిగే ప్రమాదం 62 శాతం, గుండె పోటు వచ్చే ప్రమాదం 48 శాతం తగ్గుతుందని ఆ బృందం వెల్లడించింది.
News Posted: 1 April, 2009
|