ఓట్ల యాచనలో భిక్షగాళ్ళు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఆశ్చర్యానికి గురికానున్నారు. జీవిక కోసం ఆలయం వద్ద భిక్షాటన చేసే శివపార్వతులు తమ అభ్యర్థి కోసం డబ్బులు మాత్రమే కాకుండా ఓట్లు కూడా అడగనున్నారు. శివపార్వతులు ఈ ఆలయానికి తమను తాము అంకితం చేసుకున్న కులస్థులు. జోగినులు, దేవదాసీల వలె దైవాన్ని వివాహం చేసుకున్న ఈ కులస్థులు ఇప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించాలని యోచిస్తున్నారు.
ఈ ఎన్నికలలో పోటీచేయాలని ఈ కులం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. తదనుగుణంగానే శివపార్వతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బళ్ళ సురేష్ కరీంనగర్ లోక్ సభ స్థానం కోసం నామినేషన్ పత్రం దాఖలు చేశారు.
ఈ కులం సభ్యులు దాదాపు 5000 మంది కరీంనగర్ జిల్లాలోని వివిధ ఆలయాల వద్ద నివసిస్తున్నారు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు తమ జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తుంటారు. ఈ కులం సభ్యులు తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా ఉన్నారు. ఉదాహరణకు వేములవాడలో సుమారు 400 మంది శివపార్వతులు ప్రతిరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు సమీకృతం అవుతుంటారు.
రాష్ట్రంలో వరుసగా ఏర్పడుతున్న ప్రభుత్వాలు తమ సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని శివపార్వతులు విమర్శిస్తూ, రాజకీయ నాయకులు ఎవ్వరూ తమ దుస్థితిని అర్థం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదని ఆరోపించారు. 'మా పట్ల ఔదాశీన్యం ప్రదర్శించారు. మాకు ఎవరూ అండగా నిలవడం లేదు. ఏ సంక్షేమ పథకం ఫలితాలూ మాకు అందడం లేదు. మేము పౌరులమే. కాని బడుగు వర్గాల కోసం ప్రభుత్వం ప్రకటించే కార్యక్రమాలను, సౌకర్యాలను మాకు వర్తింపచేయడం లేదు. మా బలాన్ని, ఉనికిని ప్రదర్శించడం కోసం ఎన్నికల రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాం' అని లక్ష్మి అనే శివపార్వతి చెప్పింది.
తాను కనుక ఎన్నికైతే, తన కులస్థుల సమస్యలను పరిష్కరించగలనని బళ్ళ సురేష్ చెబుతున్నారు. సురేష్ ఆర్భాటంగా ఊరేగింపుగా వెళ్ళి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. జిల్లాలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన 400 మంది సంఘం సభ్యులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
News Posted: 3 April, 2009
|