న్యూఢిల్లీ : ఎన్నికల సీజన్ కావడంతో దేశంలో గాంధి టోపీలకు తిరిగి గిరాకీ పెరిగింది. మహారాష్ట్రలోని పుణెలో టోపీల తయారీదారులకు ఇబ్బడిముబ్బడిగా ఆర్డర్లు వస్తున్నాయి. పుణె జిల్లా మంచర్ గ్రామంలో ఒక టోపీ ఉత్పత్తి సంస్థ ఈ టోపీల తయారీలో బిజీగా ఉంది.ఎన్నికలు రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ధరించే గాంధి టోపీలు తయారు చేయడానికి భగవాన్ క్యాప్స్ సంస్థ ఉద్యోగులు రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. 'ఎన్నికలు సమీపించడంతో మా టోపీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది' భగవాన్ క్యాప్స్ సంస్థ యజమాని బాలాసాహెబ్ భూటె తెలియజేశారు.
టోపీని తయారు చేయడానికి ముందు నూలు వస్త్రాన్ని బాగా ఉతికి ఆరబెడతారు. తరువాత టోపీ రూపకల్పనకు వీలుగా ఆ వస్త్రాన్ని ముక్కలు చేసి కుడతారు. వాటికి గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారు. భగవాన్ క్యాప్స్ సంస్థలో 15 మంది ఉద్యోగినులు ఉన్నారు. వారు రోజుకు 1500 టోపీలు తయారు చేస్తారు. ఆ గ్రామంలో ఇంకా ఇటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. మంచర్ గ్రామంలో రోజులు 500 పైగా టోపీలు ఉత్పత్తి అవుతుంటాయి. 'మేము ఒక్కొక్క టోపీకి ఒక రూపాయి ఆర్జిస్తుంటాం. మాలో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం వంద టోపీలు తయారు చేస్తుంటారు' అని వందన్ మోర్డె అనే టోపీ ఉత్పత్తిదారు తెలిపారు. గాంధి టోపీలు ఒక్కొక్కదానిని రూ. 20కి విక్రయిస్తారు. ఈ ఎన్నికల సీజన్ లో ఈ వ్యాపారం సూపర్ హిట్ కావడం తథ్యం.