ఓటు హక్కుపై అవ్వ మక్కువ
హైదరాబాద్ : ఆమె పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంతో సహా 13 అసెంబ్లీ ఎన్నికలలోను, 14 పార్లమెంటరీ ఎన్నికలలోను ఓటు వేసింది. ఇంకా వేయాలని ఎదురుచూస్తున్నది. శత జన్మదినోత్సవానికి నాలుగు సంవత్సరాలు మాత్రమే తక్కువగా ఉన్న సికింద్రాబాద్ కళాసిగూడ వాసి లక్ష్మమ్మ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు తన మనవడితో కలసి గురువారం పోలింగ్ కేంద్రానికి వచ్చింది.
1933లో తన వివాహానంతరం హైదరాబాద్ లో స్థిరపడిన ఈ 96 సంవత్సరాల లక్ష్మమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, 12 మంది మనవలు, ఏడుగురు మనవరాళ్ళు, ఎనిమిది మంది ముని మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. తన మనవలలో ఒకరి వద్ద ఉండే లక్ష్మమ్మ 'ఎక్స్ ప్రెస్' విలేఖరితో మాట్లాడుతూ, ఓటు వేసే అవకాశాన్ని తాను ఎన్నడూ జారవిడుచుకోలేదని చెప్పింది. 'నేను కాంగ్రెస్ కు ఓటు వేస్తుండేదానిని. ఇటీవలి కాలంలో పువ్వు (బిజెపి)ని, కారు (టిఆర్ఎస్)ను ఎంచుకుంటున్నాను' అని ఆమె తెలిపింది. పోలింగ్ కేంద్రం ఆవరణలో ఒక కుర్చీలో కూర్చున్న ఆ వృద్ధురాలు లక్ష్మమ్మ ఎందరి దృష్టినో ఆకర్షించింది.
News Posted: 17 April, 2009
|