మంత్రికి భార్య దేహశుద్ధి
ముంబై : అసలు సిసలైన బాలీవుడ్ తరహాలో మహారాష్ట్రలో జూనియర్ మంత్రి ఒకరిని మరొక మహిళతో కలసి ఉండడం చూసిన ఆయన భార్య దక్షిణ ముంబైలోని ఒక ఎంఎల్ఎ హాస్టల్ లో ఇష్టం వచ్చినట్లుగా కొట్టింది. మనోరా ఎంఎల్ఎ హాస్టల్ ప్రతినిధి ఒకరు చెప్పిన సమాచారం ప్రకారం, నాగపూర్ కు చెందిన ఆ మంత్రి, ఆయన మహిళా అతిథి ఆ హాస్టల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో కలసి ఉండగా ఆయన భార్య అకస్మాత్తుగా గదిలోకి ప్రవేశించింది.
ఆ మహిళను చూడగానే మంత్రి భార్యకు కోపం నషాళానికి అంటింది. అంతే ఆ మహిళపై ఆమె పిడిగుద్దుల వర్షం కురిపించింది. ఆమె తన భర్తను కూడా వదలిపెట్టలేదు. ఈ ఉదంతంపై అధికారిక ఫిర్యాదు ఏదీ దాఖలు కానందున మంత్రి పేరును వెల్లడి చేయలేదు. దీనిపై మాట్లాడడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు.
మంత్రి భార్య నాగపూర్ లో ఉన్నది. ముందు నిర్ణయించిన ప్రకారం సోమవారం మాత్రమే ముంబైకి ఆమె రావలసి ఉంది. అయితే, తన భర్త చేస్తున్న ఘనకార్యం గురించి ఆమెకు ఉప్పు అందినట్లున్నది. వెంటనే విమానంలో ముంబైకి బయలుదేరింది. హాస్టల్ కు చేరుకోగానే ఆమె తన భర్త గది తలుపు తట్టవలసిందిగా వాచ్ మన్ ను కోరింది. ఆ వెంటనే ఆమె గదిలోకి ప్రవేశించి, తన భర్త మరొక మహిళతో కలసి ఉండడం చూసిన వెంటనే కోపం ఆపుకోలేకపోయింది. 'ఆమె ఆ మహిళను ఇష్టం వచ్చినట్లు కొట్టి, తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా కోరింది' అని ఆ ప్రతినిధి తెలిపారు.
మంత్రి కూడా తన భార్య ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. ఆ వెంటనే మంత్రి నగరం వదలి వెళ్ళారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియరాలేదు.
News Posted: 24 April, 2009
|