ఇల్లు కొంటే పెళ్లాం ఫ్రీ!
హాంగ్ కాంగ్: 'ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు' అన్నవి ఇండియా మాటలైతే, 'ఇల్లు కొంటే పెళ్లాం ఫ్రీ' అంటున్నారు హాంగ్ కాంగ్ రియాల్టర్లు. కట్నం కూడా ఇస్తారట! చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిపోవడంతో బీజింగ్ కు చెందిన ఓ వ్యాపారి ఇవ్వజూపుతున్న ఆఫర్ అది! ఆ కంపెనీ పేరు జిన్ టాయ్ చెంగ్. 'ఇకొలాజికల్ బే'విల్లా ప్రాజెక్ట్ అనే పథకాన్ని ప్రారంభించి, కొనూగోలుదార్లను ఆకర్షించడానికి సేల్స్ గర్ల్ లను డేటింగ్ కు ఆఫర్ చేస్తోంది. వాళ్ల ఫోటోలు, ఇతర వివరాలను కంపెనీ వెబ్ సైట్ లో పొందుపరచింది. ఈ డేటింగ్ లు ముదిరి, మే 30 లోగా పెళ్లిళ్లకి దారితీస్తే ఒక్కో వరుడికీ 60వేల యువాన్(సుమారు 8,000 డాలర్లు)ల కట్నం, వాళ్లు కొనబోయే భవనం ధరలో డిస్కౌంటు లభిస్తాయి. ఈ ప్యాకేజి ఒప్పందానికి షరతు ఏమిటంటే, ఆ జంట ఏడాదిలోగా విడాకులు తీసుకోకూడదు.
ఒక మేరేజి బ్రోకర్ సర్వీసు కంపెనీతో పొత్తు పెట్టుకుని, ఆఫర్ చేస్తున్న ఈ ప్యాకేజిలు చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ తాజా దుస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే ప్రస్తుతం చైనా ఆర్ధిక రంగంలో అనిశ్చితి నెలకొన్న కారణంగా కొనుగోలుదార్లు ఇటు ఇళ్ల కొనుగోలుతే పాటు ్టు పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకుంటున్నారని చైనా ప్రభుత్వ సంస్థ అయిన అకాడెమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డైరక్టర్ లీ జింగువో చెప్పారు. చైనాలోని పట్టణ నివాసగృహాల సగటు ధరలు వచ్చే రెండేళ్లలో 40 నుంచి 50 శాతం పడిపోయే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ కావ్ జియాన్ హాయ్ చెప్పారు. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం 585 బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించినా లాభం లేకపోయింది. అందువల్లనే రియాల్టర్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తూ 'ఉచిత భార్య, కట్నం' ప్యాకేజిని ఆఫర్ చేస్తున్నాయి.
News Posted: 27 April, 2009
|