పెటాకులైన 40 ఏళ్ళ కాపురం
ముంబై : 'ఆమె సర్వస్వం తీసుకుపోయింది. చివరకు (పెళ్ళి) ఫోటోను కూడా ఆమె తీసుకువెళ్ళింది' అని సోమవారం బొంబాయి హైకోర్టులో 78 సంవత్సరాల వృద్ధుడు ఒకరు చెప్పారు. ఆయన శరీరం దృఢంగా కనిపించడం లేదు కాని ఆయన స్వరం బలహీనంగా లేదు. 40 సంవత్సరాల తమ దాంపత్యానికి ముగింపు పలకాలన్న ఆ వృద్ధ పార్సీ దంపతుల నిర్ణయం కూడా దృఢంగానే ఉన్నది. 'కక్షిదారులు పిన్నవయస్కులు అయినప్పుడు, ఉదాహరణకు 25 సంవత్సరాల వారైనప్పుడు, విడాకులు మంజూరు చేయడం సులభమే. వృద్ధాప్యంలో వ్యక్తిగత శ్రద్ధ ఎంత అవసరమో మాకు తెలుసు. కాని భర్త, భార్య ఇద్దరూ సుముఖంగా ఉండి, విడాకులకు పరస్పరం అంగీకరించినప్పుడు మేము మంజూరు చేయాలి' అని బొంబాయి హైకోర్టు ఆవరణలోని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పార్సీ వివాహ న్యాయస్థానం పేర్కొన్నది. కోర్టు తీర్పు అనంతరం దంపతులు ఎవరిదారిన వారు తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆమెకు రూ. 45 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించిన తరువాతే ఈ విడాకులు మంజూరయ్యాయి. వారి ఇళ్ళకు మధ్య ఇప్పుడు ఒక అడ్డుగోడ ఉంది.
ఈ కేసులో తన భర్త తనను 'శారీరక, మానసిక వేధింపులకు' గురి చేస్తున్నందున ఆయన నుంచి విడాకుల కావాలని అర్థిస్తూ 74 సంవత్సరాల కోర్టును ఆశ్రయించింది. ఆమె 2007లో కోర్టును ఆశ్రయించి భరణంగా రూ. 45 లక్షలు కోరింది. కాని ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమె రూ. 2 కోట్లు అడిగింది. భర్త ఇంకా తక్కువ ఇవ్వాలనుకున్నాడు. కాని చివరకు ఆమెకు రూ. 35 లక్షలు నగదు, ఫ్లాట్ ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. అయితే, సాధారణంగా పార్సీల 'జీవిత కాలం ఎక్కువ' కనుక 'వయస్సు మరింత ముదిరేంత' వరకు పార్సీలు జీవిస్తుంటారనేది దృష్టిలో పెట్టుకుని జస్టిస్ చంద్రచూడ్ ఆమెకు భర్త ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లభించేట్లు చూడాలని కోరారు. అందువల్ల భర్త చివరకు ఆమె ఆరోగ్య అవసరాల కోసం అదనంగా రూ. 10 లక్షలు ఇచ్చాడు. ఆ దంపతుల తమ ఉమ్మడి ఇంటిని రెండుగా చీల్చి, వేర్వేరు ద్వారాలతో తిరిగి జీవనం సాగించాలని నిర్ణయించుకున్నారు. ఇంటిపై మరే క్లెయిమూ చేయబోనని భార్య హామీ ఇచ్చింది. తాము ఒకే ఇంటిలో నివసిస్తున్నప్పటికీ తమ వివాహ బంధం చాలా సంవత్సరాల క్రితమే తెగిపోయిందని ఇంతకుముందు ఆమె తెలియజేసింది. జస్టిస్ చంద్రచూడ్ కోర్టులో ఆ దంపతుల కుమార్తెతో గంటకుపైగా చర్చించిన తరువాతే వారికి విడాకులు మంజూరు చేశారు. తొలుత జడ్జి వారి దాంపత్యాన్ని నిలబెట్టడానికి పలు ప్రత్యామ్నాయాలు సూచించారు. కాని వారు తమ పంతం వీడలేదు.
News Posted: 28 April, 2009
|