ఈర్ష్యతో సోదరి హత్య
లండన్ : తమ సోదరి పాపులారిటీ పెరుగుతుండడంతో అసూయ చెందిన ఇద్దరు సోదరులు టెలివిజన్ లో ఒక కార్యక్రమం ప్రదర్శించినందుకు గాయని అయిన తమ సోదరిని క్రితం వారం పాకిస్తాన్ లోని పెషావర్ లో కాల్చి చంపినట్లు తెలుస్తున్నది. 30 దశకంలోకి అడుగుపెట్టిన అయ్ మన్ ఉదాస్ హత్య నగరంలో సాంస్కృతిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని 'ది సండే టైమ్స్' పత్రిక ఆదివారం తెలియజేసింది. ఇస్లాం మత ఛాందసవాదుల ప్రాబల్యం అంతకంతకు అధికం అవుతున్న ఆ ప్రాంతంలో మహిళలపైన, సాంస్కృతిక స్వేచ్ఛపైన జరిగిన దాడిగా ఈ హత్యను పరిగణిస్తున్నారని పత్రిక తెలిపింది.
పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతాలలోను, వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోను మాట్లాడే, తన మాతృభాష పష్తూలో ఉదాస్ గీతాలు రాసి ఆలపించింది. ఆమ తరచు ప్రభుత్వ అజమాయిషీలోని టివి చానెల్ పిటివిలో కూడా ప్రదర్శనలు ఇస్తుండేది. ఉదాస్ పాపులారిటీ ఎంతదైనప్పటికీ టెలివిజన్ లో ప్రదర్శనలు ఇవ్వడం మహిళలకు పాపకార్యమేనని ఆమె కుటుంబం భావిస్తుండేది. ఆమె అలా చేయడానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండేది. క్రితం వారం ఉదాస్ భర్త బయటకు వెళ్ళిన సమయంలో ఆమె ఫ్లాట్ లోకి ఆమె సోదరులిద్దరూ ప్రవేశించి ఆమె ఛాతీలోకి మూడు తూటాలు కాల్చారని, వారిద్దరినీ పోలీసులు పట్టుకోలేదని ఆ పత్రిక తెలియజేసింది.
బుల్లితెరపై ఆమె పాడిని చివరి పాట ఆమె మరణానికి సూచికగా పరిణమించింది. 'నేను చనిపోయాను, కాని జీవించి ఉన్న వారిలో నేను ఇప్పటికీ జీవించే ఉన్నాను. ఎందుకంటే నా ప్రేమికుని కలల్లో నేను జీవిస్తున్నాను' అనేది ఆ గీతం. విడాకులు తీసుకున్న, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఉదాస్ తన హత్యకు పది రోజుల ముందు పునర్వివాహం చేసుకుంది.
News Posted: 3 May, 2009
|