ఓటమిలో కూడా లక్కీ నంబర్
హైదరాబాద్ : ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఓడిపోయి ఉండవచ్చు. కాని ఓటమిలో కూడా పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు అదృష్ట సంఖ్య లభించింది. తన అదృష్ట సంఖ్యలు 3, 6, 9 అని చంద్రశేఖరరావు విశ్వసిస్తుంటారు. తెలుగు దేశం పార్టీ (టిడిపి) సారథ్యంలోని మహా కూటమిలో కెసిఆర్ చేరిన తేదీ ఫిబ్రవరి 6 (అదృష్ట సంఖ్య), సమయం సాయంత్రం 4.02 గంటలు (ఈ అంకెలు కూడితే ఆరు వస్తుంది). ఆయన విశ్వశాంతి మహాయాగం నిర్వహించింది 27 రోజుల పాటు. (ఆ అంకెలు కూడితే 9 వస్తుంది). టిఆర్ఎస్ అధ్యక్షుడు 9 (అదృష్ట సంఖ్య) లోక్ సభ స్థానాలు, 45 (రెండు అంకెలు కూడితే 9 వస్తుంది) అసెంబ్లీ స్థానాలు అడిగి తీసుకున్నారు.
చంద్రశేఖరరావు మే 6న న్యూఢిల్లీకి వెళ్ళి 15న (ఈ రెండు అంకెలు కూడితే తిరిగి ఆరు వస్తుంది) హైదరాబాద్ లో పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చారు. పార్టీ అధినేత తమ అభ్యర్థుల కోసం మే 15 (మొత్తం 6) నుంచి శిబిరాన్ని నిర్వహించారు. టిఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు. కాని తన అదృష్ట సంఖ్యే తనకు లభించిందని కెసిఆర్ ఆనందిస్తున్నారు. ఆయన పార్టీకి రెండు లోక్ సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు, వెరసి 12 సీట్లు లభించాయి. ఈ రెండు అంకెలను కూడితే తిరిగి 3 వస్తుంది. అది ఆయన అదృష్ట సంఖ్య. మొత్తానికి ఎన్నికల ధర్మమా అి ఆయనకు అదృష్ట సంఖ్యే లభించింది.
News Posted: 17 May, 2009
|