స్వలింగ జంట పోరు
కర్నూలు : ఈ ఉదంతం విడిపోవడాలు, తిరిగి కలుసుకోవడాలతో కూడుకున్న మామూలు ప్రేమకథలా పైకి కనిపిస్తున్నది. కాని ఈ సంబంధం తిరిగి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దంపతులు పోలీసుల సాయంతో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు చీలిక కోసం పట్టుబట్టుతుండగా మరొకరు పునస్సమాగమం కోసం ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం గురించి కూలంకషంగా తెలుసుకున్న పోలీసులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 'ఓ భగవంతుడా! వారిద్దరూ మహిళలే' అని అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు.
ఆరు మాసాల క్రితం నాగలక్ష్మి, భువనేశ్వరి కర్నూలు జిల్లాలోని యెమ్మిగనూరుకు వచ్చారు. భువనేశ్వరి ఒక స్థానిక పాఠశాలలో టీచర్ గా చేరగా నాగలక్ష్మి టీ స్టాల్ ఏర్పాటు చేసింది. నాగలక్ష్మి మగవాడివలె దుస్తులు ధరిస్తూ భర్తలా వ్యవహరిస్తుండేది. భువనేశ్వరి భార్య పాత్ర పోషిస్తుండేది. ఆమె చివరకు మంగళసూత్రం కూడా ధరించింది. వారిద్దరూ మొగుడూ పెళ్ళాలుగా కనిపించేవారు కనుక ఇల్లు అద్దెకు తీసుకుని మామూలుగా జీవనం సాగించడం వారికేమీ సమస్య కాలేదు. కొంత కాలం వారు ఆనందంగా జీవితం గడిపారు. కాని రెండు రోజుల క్రితం తమ సంబంధాన్ని ముగించదలచుకున్నట్లు 'భర్త'కు 'భార్య' తెలియజేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. తనకు స్వతంత్ర జీవనం సాగించడంలో తోడ్పడవలసిందిగా అభ్యర్థిస్తూ ఆమె చివరకు బుధవారం జూపాడు బంగళా పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేసింది. తనకు అణగిమణగి ఉండేట్లుగా తనను నాగలక్ష్మి బెదరించిందని ఫిర్యాదు చేస్తూ, ఈ సంబంధాన్ని కొనసాగించదలచుకోలేదని ఆమె తెలియజేసింది.
ఈ సంగతి తెలుసుకున్న నాగలక్ష్మి కూడా పోలీసుల వద్దకు హుటాహుటిన వెళ్ళి పరస్పర అంగీకారంతో తామిద్దరూ వివాహం చేసుకున్నామని వెల్లడించింది. తమను తిరిగి కలపవలసిందిగా ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేసింది. వారిని ప్రశ్నించిన మీదట పోలీసులు వారి ప్రేమ కథకు నందవరం మండలం నాగులదిన్నెలోని రెసిడెన్షియల్ బ్రిడ్జి క్యాంప్ (ఆర్ బిసి)లో నాంది పడిందని తెలుసుకున్నారు. 22 సంవత్సరాల భువనేశ్వరిది కర్నూలు జిల్లా జూపాడు బంగళా మండలం చాబోలు గ్రామం 2004లో ఇంటర్మీడియట్ పరీక్ష పాసైన అనంతరం ఆమె ఆర్ బిసిలో చేరింది. 23 సంవత్సరాల నాగలక్ష్మిది గోనెగండ్ల మండలంలోన గుంజనపల్లి గ్రామం. ఇంటర్మీడియట్ లో తప్పిన అనంతరం ఆమె 2005లో ఆర్ బిసిలో చేరింది.
కొద్ది రోజులలోనే వారిద్దరూ సన్నిహిత స్నేహితురాళ్ళయ్యారు. వారి మధ్య అనుబంధం స్నేహాన్ని మించిపోయింది. వారు మూడు సంవత్సరాల పాటు తమ సంబంధం కొనసాగించారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం వారు హైదరాబాద్ కు నివాసం మార్చుకుని ఎల్ బి నగర్ ప్రాంతంలో ఒక కాన్సెప్ట్ స్కూల్ లో టీచర్లుగా చేరారు. అటుపిమ్మట వారి మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. కాని ఒక వారం తరువాత వారు రాజీ పడ్డారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత తాము తీసుకోవలసిన చర్యను నిర్ణయించుకుంటామని పోలీసులు తెలియజేశారు.
News Posted: 21 May, 2009
|