శరీర పరిమళానికే ప్రేమాగ్ని
లండన్ : లేత వయసులో ఘాటు ప్రేమ...తొలి చూపులోనే రెక్కలు విప్పే వలపు... లేటు వయస్సులో చాటు మోహాలు ... ఈ వింత పులకరింతలకు మానవ దేహం నుంచి వెలవడే వాసనే కారణమంటున్నారు. దేహ గుభాళింపులే గుండె లయలను మార్చేసి, వ్యామోహ కలవరింతలను కలిగిస్తాయని వివరిస్తున్నారు. ఇవన్నీ మానవదేహంలోని జన్యువుల మహిమే అంటున్నారు శాస్త్రజ్ఞులు. పరిశోధనలు జరిపి ఈ విషయం నిగ్గుదేల్చారు. శరీరం నుంచి వచ్చే వాసనే ఆడ- మగ నడుమ ప్రేమాగ్నిని రగిలిస్తుందని నిర్దారించారు. మన రోగ నిరోధక వ్యవస్థలో ఉన్న జన్యువులు శరీర వాసనను ప్రత్యేకంగా ఉంచుతాయి. ఈ జన్యువుకు మూలకేంద్రం డిఎన్ఎ అని చెబుతున్నారు. క్రొయేషియాకు చెందిన జన్యు శాస్త్ర నిపుణులు తమారా బ్రౌన్ చేసిన అధ్యయనం ప్రకారం డిఎన్ఎలో భాగమైన హ్యూమన్ ల్యూకోసైట్ ఏంటిజెన్ అనే జన్యువు ` నిజమైన ప్రేమ' వేటలో ప్రధాన భూమికను పోషిస్తుందని తేలింది.శరీరం వెలువరించే ప్రత్యేక పరిమళమే జత కట్టే భాగస్వామి పట్ల ఆకర్షణను పసిగట్టడంలో రహస్య సంకేతాలను పంపిస్తుందని తేల్చారు.
మగాళ్లందరూ జాన్ అబ్రహాం, షారూఖ్, సల్మాన్ లానో, మహేష్ బాబులానో అందగాళ్ళు కాకపోవచ్చు. ఐశ్వర్యారాయ్, బిపాసా బసు లా సౌందర్య రాశుల్లా అమ్మాయిలూ ఉండకపోవచ్చు. జగదేక వీరుడు అంతటి అందగాడు అష్టావంకర అప్పలమ్మను అమితంగా ప్రేమించేయ వచ్చు. అతిలోక సుందరి లాంటి అమ్మాయి సకల అవలక్షణాల శోభితుడిని మోహించనూ వచ్చు. తాటకి లాంటి ఆడదాన్ని ప్రేమిస్తూ తా వలచింది రంభ అనుకోడానికి, మున్సిపాలిటీ మురికి గుంటలో జలకాలాడుతూ తా మునిగింది గంగ అని ఆనందించడానికీ ఇదిగో ఈ హ్యూమన్ ల్యూకోసైట్ ఏంటిజెన్ మహాతల్లి చలువేనని శెలవిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు తమకు ఉన్న జన్యువు అమరికను బట్టి తన భాగస్వామి పట్ల శరీర వాసన ద్వారా ఆకర్షితులవుతారని తేల్చి చెబుతున్నారు.
ఈ విషయం నిగ్గుదేల్చడానికి తమారా బ్రౌన్ టీ చొక్కాల ప్రయోగాన్ని చేశారు. కొంతమంది ఆడ, మగ వారిని ఎంపిక చేసుకుని వారి డిఎన్ఏ లను విశ్లేషించారు. ఒక్కక్కరి శరీరం నుంచి వచ్చే ప్రత్యేక వాసనలకు ఆకర్షితమయ్యే ఆపోజిట్ సెక్స్ భాగస్వాములను గుర్తించారు. తరువాత మగవాళ్ళు రెండు రోజులు ధరించిన టీ చొక్కాలను ఆడవాళ్ళను వాసన చూడమన్నారు. జన్యువు విశ్లేషణలో గుర్తించనట్లే ఆడవాళ్ళు తమకు నచ్చిన వాసనకు ఉత్తేజితులైనట్టు తెలుసుకున్నారు. కానీ గర్భనిరోధక మాత్రలు వాడుతున్న ఆడవారు మాత్రం ఈ వాసనలను గుర్తించడంలో కొంత విఫలమయ్యారని కూడా కనుగొన్నారు.
News Posted: 25 May, 2009
|