మంత్రిగారి సెంటిమెంట్
న్యూఢిల్లీ : మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు సోమవారం ఉదయం 8.36 గంటల 'శుభ ముహూర్తం'లో వేద మంత్రోచ్చాటనల మధ్య రక్షణ శాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తుండగా మూడు కొబ్బరికాయలు పగలగొట్టారు. సౌత్ బ్లాక్ మొదటి అంతస్తులోని కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద ఒకటి, ఆయన డెస్క్ కింద ఒకటి, కుర్చీ కింది ఒకటి అలా మూడు కొబ్బరి కాయలు పగలగొట్టారు. పళ్ళంరాజు ఇంతకుముందు వలె నాస్తికుడైన సీనియర్ ఎ.కె. ఆంటోనీ కింద సహాయ మంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ దఫా పళ్ళంరాజు ఒక్కరే రక్షణ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు. పూర్వపు మంత్రివర్గంలో రక్షణ ఉత్పత్తుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న రావు ఇందర్ జిత్ సింగ్ తిరిగి ఎన్నికైనా ఆయనను మంత్రివర్గంలో చేర్చుకోలేదు.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, యుఎస్ ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్శిటీ నుంచి మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ అయిన పళ్ళంరాజు శుభ ముహూర్తం కోసం తన నియోజకవర్గం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఒక పురోహితుని రప్పించారు. ఆయన మే 28న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాని కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సరైన ముహూర్తం కోసం ఆయన నిరీక్షించారు.
ఈ సారి ఆయన అధికార బాధ్యతలు విస్తృతమైనవే. రక్షణోత్పత్తుల విభాగానికి మంత్రి లేరు కదా. క్రితం సారి ఆయన సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్ఒ)కు ఇన్ చార్జిగా కూడా ఉన్నారు. ఆయన నిర్వర్తించవలసిన విధులను సోమవారం సాయంత్రం ఖరారు చేశారు.
అయితే, పదవీ బాధ్యతలు స్వీకరించి, లడ్డూలు, బర్ఫీలు పంచిన తరువాత పళ్ళంరాజు ఒక యుఎస్ కాంగ్రెస్ పరిశోధనా నివేదిక పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు పెరిగిపోతున్నాయని ఆ నివేదిక తెలియజేసింది. ఇస్లామాబాద్ పై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. చైనా, పాకిస్తాన్ సహకరించుకుంటున్నాయనేది అందరికీ తెలిసిందేనని, అయితే, ఇండియా వాటిని ఒక కంట కనిపెట్టి ఉండాలని పళ్ళంరాజు అన్నారు.
News Posted: 2 June, 2009
|