ముంబాయి : ఆహార పదార్థాల్లో మసాలా ఘాటు అధికమైతే మన ముక్కుపుటాలు అదిరిపోతాయి. కళ్ళు గిర్రున తిరుగుతాయి. ఘాటు మరికాస్త ఎక్కువైతే దబ్బున కళ్ళు తిరిగి కింద పడతాం. అదే ఫ్లైటుకైతే ఫైర్ అలారం మోగించి అరిచి అల్లరి చేసేస్తుంది. ఆనక తనను గాల్లోంచి కిందికి దించి ఘాటును తొలగించేలా చేస్తుంది. శనివారం నాడు సరిగ్గా ఇదే జరిగింది.
ఫ్రాంక్ ఫర్ట్ కు చెందిన విమానం శుక్రవారంనాడు ముంబాయి ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఫైర్ అలారం గణగణమంటూ మోగింది. అలారం మోగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. అలారం హెచ్చరికలతో పైలట్ అప్పుడప్పుడే గాల్లోకి ఎగురుతున్న విమానాన్ని మళ్ళీ కిందికి దించాడు. అప్పుడు ఆ విమానంలో మొత్తం 235 మంది ప్రయాణికులున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమంటే అదే విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి తీసుకువెళుతున్న ఓ పొట్లంలో నుంచి ఘాటైన మసాలా వాసన వచ్చింది. ఆ వాసనను పసిగట్టిన విమానం ఒక్కసారిగా ఫైర్ అలారం మోగించింది. వెంటనే విమానాన్ని కిందికి దింపి తనిఖీలు నిర్వహించినప్పుడు మసాలా విషయం బయటపడింది. దీనితో ప్రయాణికులంతా ఒక్కసారిగా 'హమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.