మాంద్యంతో విలవిల
హైదరాబాద్ : యుక్తవయసులోకి వచ్చిన అమ్మాయో, అబ్బాయో చిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టారంటే వారు ప్రేమలో పడ్డట్టు. మరి ఉద్యోగం చేస్తున్న వారు అప్పటి వరకు ప్రవర్తించిన దానికి పూర్తిగా భిన్నంగా చిత్రంగా ప్రవర్తించడం, డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసేవారు కాస్తా పొదుపరులుగా మారడం, భయపడడం, నిద్రలేని రాత్రులు గడపడం, కలవరించడం వంటివి చేస్తున్నారంటే అది మాంద్యం ప్రభావమన్నమాట! అమెరికాలో మాంద్యం దెబ్బతో ఇక్కడి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఒక్క ఐటి రంగంపైనే కాకుండా ఇతర రంగాలపై సైతం మాంద్యం ప్రభావం గణనీయంగానే పడింది. మీడియా రంగంపై సైతం ఊహించని విధంగా మాంద్యం ప్రభావం పడింది. అనేక ఐటి కంపెనీల్లో పొదుపు ఉద్యమం సాగుతోంది. చివరకు కొన్ని ఐటి కంపెనీలు బాత్ రూంలలో ఉపయోగించే పేపర్ సౌకర్యాన్ని సైతం రద్దు చేశారు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి వల్ల ఐటి ఉద్యోగుల్లో మానసిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. కుదిరిన పెళ్లి సంబంధాలు సైతం రద్దవుతున్నాయి.
దేశంలో తొలి ప్రైవేట్ సాటిలైట్ చానల్ జీ సంస్ధలో పై స్థాయి ఉద్యోగుల వేతనాలను 30 శాతం వరకు కత్తిరించారు. ఇక కింద స్థాయి ఉద్యోగుల జీతాలకు కోత విధించక పోయినా ఏటా వచ్చే ఇంక్రిమెంట్లను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఏయే ఖర్చులకు కోత విధించి పొదుపు పాటించవచ్చునో ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు జాబితాను పంపించారు. ఆమెరికా మాంద్యం ప్రభావం మన దేశంపై ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఎక్కువ ప్రభావం పడే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. ఆ ప్రభావం ఒక్క ఐటి రంగంపైనే కాకుండా ఇతర రంగాలపై సైతం బలంగానే పడింది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని అంచనా వేసినప్పటికీ అలాంటి ప్రభావమేమీ కనిపించడం లేదు. మాంద్యం నుంచి బయటపడేంత వరకు పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉంది. ఐటి కంపెనీల్లో గతంలో ఉద్యోగులను ఇంటి నుంచి కారులో తీసుకువెళ్ళి మళ్ళీ కారులో ఇంటివద్ద దింపేవారు. ఐటి బూమ్ తరువాత హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ట్యాక్సీలు వచ్చాయి. ఐటి ఆదాయం తగ్గడంతో పాటు ఈ ట్యాక్సీల వారు సైతం సంక్షోభంలో పడిపోయారు.
కొన్ని కంపెనీల్లో ఉద్యోగులను తగ్గిస్తుంటే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మాత్రం చిత్రంగా తమ బ్యాంకుల్లో నిర్ణీత సమయాల్లో మాత్రమే పని చేయాలని ఎక్కువ సమయం పనిచేయవద్దని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. హెచ్ డి ఎఫ్ సి చాలా బ్రాంచీల్లో రాత్రి వరకు ఉద్యోగులు పనిచేస్తుంటారు. నాలుగు గంటలకు బ్యాంకు సమయం ముగియగానే మరో రెండు గంటలకు మించి కంప్యూటర్లు ఆన్ లో ఉండరాదని సూచించారు. హెచ్ డి ఎఫ్ సిలో దేశ వ్యాప్తంగా మొత్తం 53వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ఉద్యోగులు రాత్రి వరకు ఆఫీసులోనే గడపడం వల్ల కుటుంబ సభ్యులతో సరిగా ఉండలేకపోతున్నారని, దీనివల్ల పని తీరుపై కూడా ప్రభావం పడుతుందని ఎక్కువ సమయం పని చేసినప్పటికీ నాణ్యమైన పని తీరు ఉండదని అందుకే సమయాన్ని కచ్చితంగా పాటించి సాయంత్రానికి పనిముగించుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు హెచ్ డి ఎఫ్ సి ప్రకటించింది. మాంద్యం ప్రభావం మీడియాపై సైతం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. కొన్ని చానల్స్ సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. గతంలో వేతనాలను పెంచడంలో పోటీ పడితే ఇప్పుడు క్రమంగా తగ్గించడం మొదలు పెట్టాయి.
News Posted: 15 June, 2009
|