బట్టతల కేలిక్యులేటర్
బట్టతలతో బతుకును భారంగా గడిపే నవ యువకులకో శుభవార్త. బట్టతల ప్రమాదం నుంచి బైటపడే అవకాశాన్ని కంప్యూటర్ నిపుణులు అందిస్తున్నారు. బట్టతల ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఏ వయస్సులో తలవెంట్రుకలు గుప్పెడు గుప్పెడుగా రాలిపోతాయి. నెత్తి మీది వెంట్రుకల బలాలను, బలహీనతలను కచ్చితంగా కొలిచే కంప్యూటర్ ను జర్మన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బట్టతల కేలిక్యులేటర్ గా పిలిచే ఈ కంప్యూటర్ సహాయంతో బట్టతల రాకుండా ముందే జాగ్రత్త పడే అవకాశం వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. శిరోజాల సంరక్షణ ఔషధాలను తయారుచేసే డాక్టర్ కర్ట్ వుల్ఫ్ సంస్థ చేసిన పరిశోధనల్లో డాక్టర్ అడాల్ఫ్ క్లెంక్ ఈ కాలిక్యులేటర్ ను రూపోందించారు.
అప్పుడే రెండు పక్కలా ఎకరాలకు ఎకరాలు కొట్టేసిందని బాధ పడే పురుషులకు ఈ పరికరం ఊరట కలిగించి తీరుతుందని క్లెంక్ భరోసా ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 సంవత్సరాలు నిండిన యువకుల్లో నుదురు రెండు వైపులా సమానంగా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. బట్టతల ఏర్పడటానికి అదే అంకురార్పణ. ఈ కంప్యూటర్ కు అలాంటి యువకులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. ఆ యువకుని వయస్సు, వివాహం అయిందా లేదా? చేస్తున్న ఉద్యోగం, నివసిస్తున్న ప్రాంతం, ఆహరపు అలవాట్లు, వంశపారంపర్య బట్టతల చరిత్ర, ప్రస్తుతం వెంట్రుకలు రాలుతున్న శాతం, మిగతా వత్తిడి కలిగించే అంశాలను కంప్యూటర్ లో పొందు పరిచిన తరువాత దానిని విశ్లేషిస్తారు.
సాధారణంగా బట్టతలకు వంశపారంపర్య జన్యువులు కారణమని డాక్టర్ క్లెంక్ వివరించారు. అది కాకుండా దీర్ఘకాలిక తీవ్ర మానసిక వత్తిడులు, జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోవడం, సన్నిహితులను ఆకస్మకంగా కోల్పోవడం వంటివి కూడా బట్టతల రావడానికి కారణమవుతాయని ఆయన చెప్పారు. కంప్యూటర్ విశ్లేషణ అనంతరం పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ బట్టతల రాకుండా బయటపడవచ్చని ఆయన చెబుతున్నారు.
News Posted: 25 June, 2009
|