బాన పొట్ట...బీరు కథ
మెల్ బోర్న్ : బానపొట్ట... పీల కాళ్ళు. కుర్రోడే కానీ బీర్లు బాగా పట్టిస్తున్నాడు కాబోలు. పాపం పొట్ట పెరిగిపోయిందని అమ్మాయిలు జాలిగా చూస్తున్నారా? మీరేం వర్రీ కాకండి. ఎవరూ మెచ్చని, ప్రేమించని విధంగా పొట్ట పెరిగిపోయిందా... మీకో చల్లని కబురు. మీరు బీరు మాత్రం మానేయక్కర్లేదు. ఎందుకంటే బాన పొట్ట రావడానికి బీరు తాగడం కారణం కాదని శాస్త్రజ్ఞలు తేల్చిచెప్పేశారు. రోజూ క్రమం తప్పకుండా బాటిల్ మీద బాటిల్ ఎత్తి బీరు తాగే వేలాది మంది పై పరిశోధనలు చేసి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి బీరు కారణం కాదని, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులే దానికి అసలైన కారణమని కనిపెట్టేశారు.
పరిశోధకులు ఇరవై వేల మందిని పరిశీలించారు. వీరిలో 7876 మంది పురుషులు, 12749 మంది స్త్రీలు ఉన్నారు. రోజూ క్రమం తప్పకుండా విరగతాగే వీరిని పరిశీలించిన అనంతరం బాన పొట్టకు బీరుకు అంతగా సంబంధం కనిపించడం లేదని గ్రహించారు. కాని పిరుదల నుంచి నడుము వరకు చుట్టుకొలతలు మాత్రం మారుతాయని కనిపెట్టారు. మెత్త బాగా పెరుగుతుందని, బీరు తాగిన వారు మిగతా వారితో పోలిస్తే బరువు బాగా పెరుగుతున్నారని నిర్ధారించారు. బాన పొట్ట విషయంలో చాలా మంది బీరు తాగని, పోనీ మద్యమే ముట్టని వారికీ వస్తుందని తేల్చారు. బాన పొట్ట, బరువు పెరగటానికి బీరు తాగడం కంటే జన్యు పరమైన కారణాలే ఎక్కువని అంటున్నారు. కాకపోతే తక్కువ మందు తాగేవారి నడుము చుట్టు కొలత కంటే బాగా లాగించే మందుబాబుల, మందుమణుల నడము చుట్టు కొలతలు కొంచెం ఏక్కువేనని వీరు వివరించారు. బీరును మక్కువగా లాగంచే భామామణులు మాత్రం బరువు బాగా పెరిగిపొతున్నారట. ఏమైనా బీరు తాగడం వల్ల శరీరం బరువు పెరగడం ఖాయమని, ఇది ఆరోగ్యపరమైన సమస్యలకు కారణం కావచ్చని సెలవిస్తున్నారు.
News Posted: 7 July, 2009
|