పని మనుషులకు శిక్షణ!
న్యూఢిల్లీ : 'ఇంటిలో పని మనిషి సరిగ్గా పని చేయడం లేదు - శుభ్రంగా ఊడ్చడం లేదు - అంట్లు బాగా తోమదు... పని చెబితే రుసరుసలాడుతుంది' అంటూ ఇంటి 'మహరాణులు' దీర్ఘాలు తీయాల్సిన పని లేదు. సరిగ్గా పని చేయని పని మనుషులకు న్యూఢిల్లీలో శిక్షణ ఇప్పస్తే సరి. నైపుణ్యం లేని పనివాళ్ళకు మూడంచెల శిక్షణను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఇవ్వనున్నది. వంటా వార్పుతో పాటు అక్షరాస్యత, క్రమశిక్షణ, శుచి - పరిశుభ్రతలను వీరికి ఈ శిక్షణలో నేర్పుతారు.
ఇటువంటి పథకాన్నిఐఎల్ ఓ తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభించిందని ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి నీలం అగ్నిహోత్రి చెప్పారు. ఈ పైలెట్ పథకాన్ని ఈ నెల 11న ఢిల్లీలో 250 మంది అభ్యర్థులకు అమలు చేయనున్నారు. వీరికి శిక్షణ 80 నుంచి 130 గంటల మధ్య ఉంటుంది. ఆయా కోర్సుల్లో చేరేందుకు రుసుం కేవలం 200 రూపాయలు మాత్రమే.
ఇక మీదట పనివాళ్ళను కేవలం పనివాళ్ళుగా కాకుండా వృత్తి నిపుణులుగా పరగణించే రోజు ఎంతో దూరం లేదని విశ్లేషకుడొకరు పేర్కొన్నారు. దీని వల్ల ఇంటి యజమానికి రెండు విధాలుగా లబ్ధి కలుగుతుంది. శిక్షణ పొందిన పని వారు నైపుణ్యంతో పనిచేస్తారు. వారి చరిత్ర గురించి ఆలోచించాల్సిన పని లేదు. వారి నేపథ్యాన్ని శక్షణ అధికారులు పరిశీలిస్తారని కార్మిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో పైలెట్ ప్రాజెక్టును అమలు చేయడంలో నాలుగు ఉపాధి కల్పన సంస్థలు, రెండు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉంది. శిక్షణ పూర్తిచేసిన పనివారికి జాతీయ వృత్తి శిక్షణ మండలి (ఎన్ సి వి టి) ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తుంద. వారంతా నిపుణత గల పనివారుగా తమను నమోదు చేసుకోవచ్చు.
'ఈ వృత్తి నైపుణ్యం గల పనివారికి కనీస వేతనాలను కార్మిక శాఖ నిర్ణయిస్తుందా' అని ఒక అధికారిని ప్రశ్నించగా, ప్రస్తుతానికైతే శిక్షణ పొందిన కారణంగా వారికి వేతనాలు పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
News Posted: 8 July, 2009
|