తిండి తగ్గితే కుర్రతనం!
న్యూఢిల్లీ : 'కండ గలవాడే మనిషోయ్' అనిపించుకోవడానికి తినాలన్న ఆరాటాన్ని ఇక మీదట తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే భారతీయ సంతతికి చెందిన కోతులపై చేసిన పరిశోధనలో కేలరీలు తక్కువగా తీసుకుంటే వయసు మీద పడినట్టు కనిపించడం తగ్గింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన 20 ఏళ్ల పరిశోధన దీన్నే రుజువు చేస్తోంది. విస్కాన్సిన్ యానివర్శిటీలోని జాతీయ ప్రధాన పరిశోధనా కేంద్రంలో వానరాలపై ఈ పరిశోధన జరిగింది. పుష్కరం క్రితం హైదరాబాద్ లో జరిగిన పరిశోధనా ఫలితాలు కూడా దీన్నే ధ్రువీకరిస్తున్నాయి. విస్కాన్సిన్ శాస్త్రవేత్తల బృందం 38 కోతుల మందను స్వేచ్ఛగా తినబెట్టారు. మరో 38 కోతుల మందకు 30శాతం కేలరీలు తక్కువ లభించేలా ఆహారం అందుబాటులో పరిమితంగా కేలరీలను ఆహారంగా ఇవ్వడం వల్ల వయోసంబంధ వ్యాధుల తగ్గుదలతోపాటు ఆయువును పెంచుతోంది. ఈ మేరకు అమెరికా జర్నల్ - సైన్స్ టుడేలో ప్రచురితమైంది.
మితంగా తిన్న కోతుల్లో కంటే అమితంగా ఆహారం తీసుకున్న మర్కటాల్లో కేన్సర్, హృద్రోగ సంబంధ వ్యాధులు 50శాతం ఎక్కువగా వచ్చాయి. అయితే, ఈ విధానాన్ని మానవులకు ఇంకా వర్తింప చేయలేదని పరిశోధనాబృందం చెప్పింది. కార్నెల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 1935లో క్షీరదాలపై రోడెంట్స్ లో చేసిన పరిశోధన కూడా తక్కువ కేలరీల భావనకు ఊతమిచ్చింది. హైదరాబాద్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త కల్లూరి సుబ్బారావు తక్కువ ఆహారం తీసుకునే వారు ఉత్సాహంగా ఉంటారని 1996లోనే ప్రకటించారు. కొన్ని ఎంజైమ్ లు వయసు పెరుగుదలను నియంత్రిస్తాయని అంచనాకు వచ్చారు.
News Posted: 11 July, 2009
|