బడికొచ్చిన బాల వధువు
చెన్నై : చట్టాల్లో పేర్కొన్న విధంగా పెళ్ళి వయస్సు రాకుండానే వివాహం చేసుకున్న బాలికను పాఠశాల నుంచి వెళ్ళగొట్టింది యాజమాన్యం. కానీ సాక్షాత్తు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో తిరిగి చేర్చుకుంది. కడలూరులోని సెయింట్ ఆన్స్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతున్న 17 యేళ్ళ ఆర్ ఇందుమతికి పెళ్ళి చేసేశారు పెద్దలు. ఈ బాల్య వివాహాన్ని తాము అంగీకరించబోమని, ఇలాంటి వ్యవహారాలు మిగతా పిల్లలపై ప్రభావం చూపెడతాయని చెబుతూ పాఠశాల యాజమాన్యం ఇందుమతిని బయటకు పంపేసింది. వేసవి సెలవుల్లో జూన్ 5వ తేదీన ఇందుమతికి అతని మేనమామ బాలన్ తో వివాహం జరిగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వెళ్ళిన ఇందుమతికి తరగతులకు హజరయ్యేందుకు అనుమతి లభించలేదు. పాఠశాల యాజమాన్యం ముందు ఇందుమతిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. తరువాత టిసి ఇచ్చి పంపేసింది.
కాగా, తన బావమరిది ఆరోగ్యం క్షీణించిందని, అతను తన కుమారుని వివాహం చూసి కన్నుమూయాలన్న కోరికను వ్యక్తం చేయడంతో ఈ వివాహం చేయవలసి వచ్చిందని ఇందుమతి తండ్రి రవి చంద్రన్ అందరికీ మొర పెట్టుకున్నాడు. కూతురు చదువుకు పెళ్ళి ఇలా ఆటంకం కలిగిస్తుందని ఆయన ఊహించలేకపోయాడు. ఇందుమతి పరీక్షలు అయ్యేంత వరకూ నూతన దంపతులను విడివిడిగా ఎవరి ఇళ్ళలో వాళ్ళను ఉంచడానికే తాము నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నాడు. దాంతో దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా ఎంఎల్ఎ రవి కుమార్ ఈ వ్యవహారాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. తమిళనాడు పాఠశాల విద్య శాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రత్యకంగా ఇందుమతి కేసును పరిశీలించారు. పాఠశాల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునెలా ప్రయత్నించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. పద్దెనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళి చేసుకున్నందుకు బాలిక విద్యను పొందే అవకాశాన్ని రద్దు చేయాలన్న చట్టం ఏదీ లేదన్న వాదన పాఠశాల యాజమాన్యాన్ని ఆలోచింపజేసింది. మొత్తానికి ఇందుమతి మళ్ళీ చదువుకోడానికి స్కూలుకు వెళుతోంది.
చక్కగా చదువుకుంటున్న బాలిక వివాహం చేసుకోడానికి దారితీసిన పరిస్థితులను అధికారులు సానుభూతితో అర్ధం చేసుకున్నారని ఎంఎల్ఎ రవి కుమార్ అన్నారు. బాలిక సామాజిక, ఆర్దక నేపథ్యాన్ని పరిగణనలోనికి తీసుకున్నందునే ఆమెకు చివరకు న్యాయం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బాలిక కోణం నుంచి మానవతా దృష్టితో ఆలోచించి చర్య తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి తెన్నరసు అన్నారు. అంత మాత్రం చేత మేము బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 17 July, 2009
|