పేరులోనే పెన్నిధి!
హైదరాబాద్: ఏ మనిషికైనా ఇష్టమైనవి రెండున్నాయి. ఒకటి రూపం.. మరొకటి నామం. రూప, నామాల్ని ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేక పోవడం సహజం. చిన్నప్పటి నుంచి అలవాటైన పేరును మార్చుకోవాలంటే.. ఇబ్బంది పడటం సహజం. పెంటయ్య, పెంటమ్మ వంటి పేర్లు పిలిపించుకోవడానికి ఇబ్బందిగా అనిపించి తమ పేర్లు మార్చుకోవాలని ఎవరైనా చూస్తారు. అలా కాకుండా కూడా పేరు మార్పిడి అన్నారంటే తమ పేరు ప్రత్యేకంగా .. ఫ్యాషన్ గా ఉండాలన్నమోజన్నా కావాలి. లేదా కలిసొస్తుందన్న నమ్మకం అలా పురికొల్పుతుంది. అన్నట్టు.. ఒక్క హైదరాబాద్ లోనే గత ఏడాది 80వేల మంది తమ పేర్లు మార్చుకున్నారు. వీరిలో ఎక్కువ మంది 35 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారు.
వీరిలో కొందరు తమ సిద్ధాంతి చెప్పాడని పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం తమ పేరు దేవతదే అయినా.. వేరే దేవత పేరే మీకు సరిపోతుందని జ్యోతిషవేత్త చెప్పడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా లక్ష్మీనారాయణ కాస్తా సూర్యనారాయణగా మారారు. కొంతమంది కుర్రకారైతే.. తమ తల్లిదండ్రులు పెట్టిన పేరు మోడ్రన్ గా లేదని కూడా మార్చుకుంటున్నారు. తమను కరుణించిన దేవతలందరినీ సంతోషపెట్టేందుకు పెద్దలు నామకరణం చేసిన.. వీరవెంకట సత్యనారాయణ లక్ష్మీదుర్గాప్రసాద్ ను మూడు లేదా ఐదు అక్షరాల్లో పిలిచే పేర్లను ఎంపిక చేసుకుంటున్నారు. పేరులో ఏముంది.. అన్నది పాతపాట. పేరులో'నేము'న్నది ఇప్పటిమాట!
News Posted: 20 July, 2009
|