ప్రేమ గుడ్డిదే...
వాషింగ్టన్ : ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం అని సినిమా విషాద గీతాలు పాడుకునే వాళ్ళ సంగతి మనకెందకు లెండి... ప్రేమలో పీకలదాకా కూరుకుపోయిన వాళ్ళ సంగతి ఇది. మహానుభావుడు షేక్స్పియర్ చెప్పినట్టు `ప్రేమ గుడ్డిది' అని నిరూపించారు పరిశోధకులు. ప్రేమలో నిండా మునిగినవారికి కొంచెం చూపు మందగిస్తుందట! దృష్టిని సక్రమంగా కేంద్రీకరించలేరట... దేనిలో అంటే ప్రస్తుత తన ప్రియురాలు లేదా ప్రియుని కంటే అందమైన వాళ్ళను గమనించడంలోనని తేల్చి చెప్పారు అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో రీసెర్చ స్కాలర్ గా ఉన్న జాన్ మనర్. సహజంగా ఎదురుగా అందమైన వాళ్ళు కనిపిస్తే రెప్పవేయకుండా చూస్తాం. కాని అప్పటికే ప్రేమాయణంలో ప్రయాణం చేస్తున్న వారు ఎదురుగా జగదేక వీరుడు కనిపించినా, అతిలోక సుందరి అగుపించినా చూసీ చూడనట్లు వదిలేస్తారట.
ఇంకా మంచి జోడి అని ఎవరు చెప్పినా అప్పటికే ప్రేమిస్తున్న సహచరుని మార్చుకోడానికి ప్రేమ గుడ్డి వాళ్లు ఇష్టపడరట. ఏ ప్రేమలోనూ పడనివాళ్ళు మాత్రం తమ జోడీని ఎంచుకోడానికి అన్ని రకాల పరిశీనలను చేస్తారట. ఇప్పటికే ప్రేమలో పడ్డ 57 మందిని మనర్ బృందం ఎంపిక చేసి వారు గాఢమైన ప్రేమలో పడ్డ సందర్భాన్ని వివరిస్తూ వ్యాసాన్ని రాయమన్నారు. అలానే మరో 56 మంది ప్రేమలో పడని వాళ్ళతో వారు తమ జీవితంలోని అతి ఆనందకరమైన భావనలను గురించి వ్యాసాలను రాయించారు. తరువాత వీరికి అందమైన అమ్మాయిల, అబ్బాయిల కు చెందిన ఫోటోలను క్షణాల వ్యవధిలో చూపించారు. ప్రేమలో పడిన వారు చాలా తక్కువ సమయంలోనే అందమైన ముఖాలను గుర్తించగలిగారని, ప్రేమలో పడని వారు కొంత సమయాన్ని తీసుకున్నారని మనర్ వివరించారు. ప్రేమ భావనలు ఉన్న వారు తమ జీవిత సహచరులు కాగల వారిని త్వరగా గుర్తిస్తారని విశ్లేషించారు.
News Posted: 28 July, 2009
|