ముద్దుల అమ్మకం మెల్ బోర్న్ : పెట్టుబడి లేకుండా గిట్టుబాటు అయ్యే వ్యాపారం... దుకాణం అక్కర్లేదు. సరుకు సంరంజామా అక్కర్లేదు... అలాంటి అందమైన అమ్మకాన్ని చేపట్టాడో యువకుడు. సిడ్నీలోని క్వీన్ విక్టోరియా భవనం బయట నిలబడి ఆ యువకుడు ముద్దులను అమ్ముతున్నాడు. ఒక డాలర్ చెల్లిస్తే ఎవరికైనా పెదవులపైన ఓ చక్కని ముద్దిస్తాడు. లాచ్లన్ క్రీస్టీ అనే ఈ యువకుడు గత రెండు వారాలుగా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. రోజుకు ఐదు నుంచి పది డాలర్లు సంపాయిస్తున్నానని చెప్పిన 24 యేళ్ళ క్రీస్టీ అన్ని సామాజిక కట్టుబాట్లను బద్దలు చేయడానికే తానీ పని చేస్తున్నట్లు వివరించాడు.
`నేను సమాజంపై ప్రయోగం చేస్తున్నాను. ప్రజల నుంచి స్పందనను గమనిస్తున్నాను. గడచిన యాభై నిముషాలలో మూడు ముద్దులు అమ్మాను' అని క్రీస్టీ వివరించాడు. కానీ తాను ఊహించినంత ఎక్కువ సంఖ్యలో పెదవులపై ముద్దు పెట్టించుకోడానికి స్త్రీలు ముందుకు రావడం లేదని చెప్పాడు. కొంతమంది ధైర్యం ఉన్న అమ్మాయిలు వస్తున్నారని, చాలా మంది డబ్బులివ్వడానకి అంగీకరిస్తున్నారు కానీ ముద్దు పెట్టించుకోడానికి తిరస్కరిస్తున్నారని తెలిపాడు.
ఈ పని ద్వారా తానేనీ గర్లఫ్రెండ్ ను అన్వేషించడం లేదని చెప్పాడు. సాంఘిక కట్టుబాట్ల చట్రాలను సవాలు చేయడం, వాటి సరిహద్దులను చెరిపేయడం తన లక్ష్యమని వివరించాడు. దీని గురించి బాగా ప్రచారం జరిగితే తన వ్యాపారం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసాడు. ఉచిత కౌగిలి ఆలోచనను ఆచరణలో పెట్టిన జాన్ మాన్ తనకు ఆదర్శమని, ఇప్పుడు ఉచిత కౌగిలి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలా మారిందని క్రీస్టీ గుర్తుచేస్తున్నాడు.
News Posted: 28 August, 2009
|