కోతులు చేసిన మేలు! గౌహతి : టీ తోటల పెంపకం కోతులకు రుచించని వ్యవహారం. కాని వానర చేష్టలే ఆ గ్రామస్థుల జీవితాలను మార్చివేశాయి. అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలో నదువార్్ - సోటియా - జముగురి ప్రాంతంలో గ్రామస్థులు రీసస్ జాతి కోతుల సైన్యంతో సదా పోరు సాగిస్తుండేవారు. కోతులు వారి పంటలను ధ్వంసం చేసేవి, వంటగదులపై దాడులు సాగించేవి, వారి పిల్లలపై దౌర్జన్యం చేసేవి. ఇందుకు ప్రతీకారంగా గ్రామస్థులు వాటిని వధించేవారు. కోతులు పగటి పూట దాడులు సాగిస్తూ రాత్రయ్యేసరికి సమీపంలోని నదువార్ రిజర్వ్ అడవిలోకి పారిపోయేవి.
తుకియా గ్రామానికి చెందిన అన్వర్ నసీర్ 1990 దశకం మధ్యలో తన వ్యవసాయ పొలాన్ని చిన్న తేయాకు తోటగా మార్చాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు పరిస్థితి అది. 'కోతులు ఇష్టపడనిది ఏదైనా మేము పెంచవలసి వచ్చింది' అని ఆ ప్రాంతపు చిన్న తేయాకు రైతుల సంఘం (ఎస్ టిజిఎ) కార్యదర్శి చెప్పారు. అసోంలో రూ. 850 కోట్లు విలువ చేసే తేయాకు పరిశ్రమలో భాగంగా రమారమి 60 వేల మంది చిన్న తేయాకు రైతులు ఉన్నారు. తుకియాలో ఇతరులు అదే మార్గాన్ని అనుసరించడానికి ఎక్కువ వ్యవధి తీసుకోలేదు.
'ప్రస్తుతం 900 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో సుమారు 400 కుటుంబాలు తేయాకు తోటలు పెంచుతూ సంపన్నులు అయ్యారు. అధిక సంఖ్యాక కోతులు అడవులకు తిరిగి చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికే సంచరించే కొన్ని కోతులు వేప, జామ గింజలతో సరిపెట్టుకుంటున్నాయి' అని తుకియా గ్రామానికి చెందిన టీచర్, తేయాకు రైతు దీపక్ సైకియా చెప్పారు.
అయితే, ఈ మార్పు ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపింది. 'ఇక్కడ విద్యాధికులైన నిరుద్యోగులను వెతికి పట్టుకోవడం కష్టం. దాదాపు ప్రతి రైతుకు ఒక కారు, ఒక భవనం ఉన్నాయి' అని ఆయన తెలిపారు. గౌహతికి సుమారు 230 కిలో మీటర్ల దూరంలోని నదువార్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 'కోతులే కనుక లేకపోతే మేము ఈ విజయాన్ని సాధించి ఉండేవారం కాదు. వెయ్యి మందికి పైగా ఆదివాసి, నేపాలీ కార్మికులకు ఆదాయ వనరు కూడా వాటి ధర్మమా అని లభించింది' అని నదువార్ తేయాకు రైతుల సంఘం అధ్యక్షుడు ప్రశాంత భగవతి చెప్పారు.
News Posted: 1 September, 2009
|