చావులోనూ చెట్టాపట్టాల్ లండన్ : 81 సంవత్సరాలు పాటు అనితతో కాపురం చేసిన ఫ్రాంక్ మిల్ ఫోర్డ్ మరణించారు. దీనితో బ్రిటన్ లో సుదీర్ఘమైన వైవాహిక బంధం ముగిసినట్లయింది. ప్లిమత్ పట్టణంలో వార్విక్ పార్క్ నర్సింగ్ హోమ్ లో మంగళవారం మధ్యాహ్నం ఫ్రాంక్ మరణించినట్లు, ఆయన మరణించే సమయానికి అనిత చేతులను పట్టుకునే ఉన్నట్లు వారి కుమారుడు తెలియజేశారు.
ఇప్పుడు ఉభయులూ 101 సంవత్సరాల వయస్కులు. వారు తొలుత ఒక వైఎంసిఎ నృత్య కార్యక్రమంలో కలుసుకుని 1928 మే 26న కార్న్ వాల్ లో వివాహం చేసుకున్నారు. అనిత తన చెంతే ఉండగా ఫ్రాంక్ ప్రశాంతంగా కన్ను మూసినట్లు నర్సింగ్ హోమ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
తన తండ్రి మరణించినప్పుడు ఆయన చేతిని తన తల్లి పట్టుకునే ఉన్నట్లు వారి 76 ఏళ్ళ కుమారుడు తెలియజేశారు. వారి కుమారుని పేరు కూడా ఫ్రాంక్. 'ఆమె బాగా కుంగిపోయింది. కాని ఆయన మరణ సమయానికి ఆమె పక్కనే కూర్చుని ఆయన చేతిని పట్టుకునే ఉన్నది' అని ఫ్రాంక్ చెప్పారు.
ప్లిమత్ లో నాజీలు బాంబులు వేసినప్పుడు పట్టణంలోనే ఉన్న, రెండు బాంబుల బారి నుంచి తప్పించుకున్న ఆ దంపతులు తమ వైవాహిక బంధం రహస్యం 'ఇచ్చి పుచ్చుకోవడమే' అని, తగాదా పడినా రాజీ పడిపోయి ముద్దులు, గాఢాలింగనాలు చేసుకునేవారమని చెప్పారు.
ఫ్రాంక్, అనితా మిల్ ఫోర్డ్ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఐదుగురు మనవలు, మనవరాళ్ళు, ఏడుగురు ముని మనవలు, ముని మనవరాళ్ళు ఉన్నారు.
News Posted: 4 September, 2009
|