పసిడి కోసం 15 పెళ్ళిళ్ళు తిరునెల్వేలి : చోరులు కొండొకచో మరీ తెలివిమీరి పోతుంటారు. తమ పబ్బం గడుపుకోవడానికి నానా వ్యూహాలు పన్నుతుంటారు. కాని చివరికి విధి వక్రించి వారు పట్టుబడుతుంటారు. తమిళనాడులో ఒక మహిళ ఇదే కోవలోకి వస్తుంది. 31 సంవత్సరాల మహిళ 15 మంది పురుషులను 'వివాహమాడి' వారి నగదు, నగలతో పరారవుతుండేది. కాని చివరకు పాలయంకోట్టై పట్టణం సమీపంలో ఆమె పోలీసుల వలలో చిక్కింది. తిరునెల్వేలి జిల్లా అనవరతనల్లూరు గ్రామ వాసి అయిన ఆ మహిళను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 15 నవర్సుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ మహిళ అరెస్టుతో తిరునెల్వేలి పట్టణంలోను, పరిసరాలలోను వరుస చోరీల వెనుక మిస్టరీని ఛేదించినట్లు పోలీసులు చెప్పారు. ఆమె ఆ పురుషులను వివాహం చేసుకుని, కొన్ని రోజుల తరువాత వారి ఇళ్ళలో నుంచి డబ్బు, నగలు, ఇతర వస్తువులు చేజిక్కించుకుని పరారవుతుండేది. తన మొదటి వివాహం విఫలమై ఇద్దరు పిల్లల భారం పైనబడగా తనను, తన పిల్లలను పోషించేందుకు డబ్బు లేకపోవడంతో ఆ మహిళ 'పెళ్ళి - పరారీ' పద్ధతికి ఉపక్రమించిందని పోలీసులు తెలిపారు.
News Posted: 7 September, 2009
|