బకెట్ స్నానమే బెస్ట్ న్యూఢిల్లీ : కూనిరాగాలు తీస్తూ, నీటి తుంపర స్నానం (షవర్ బాత్)లో ఆనందం మాటేమో కానీ... హానికారక బాక్టీరియా మాత్రం ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్లు కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేల్లో షవర్ బాత్ లో తుంపరను వదిలే జల్లెడ (షవర్ హెడ్) వద్ద నలకలు ఇతరత్రా మురికి పేరుకొని బాక్టీరియాకు నెలవుగా మారుతుందని తేలింది.
తుంపర వదిలినప్పుడు ఈ బాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి కొద్దికొద్దిగా పోతుందన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. షవర్ హెడ్ ల్లో బాక్టీరియా దాగిన విషయాన్ని రెండేళ్ళ క్రితం తొలిగా కనుగొన్నట్టు కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం సభ్యుడు లేహ్ ఫీజెల్ తెలిపారు. తాజా అధ్యయనంలో బాక్టీరియా ఏ విధంగా జీవిస్తుందన్న విషయాన్ని అమెరికాలోని తొమ్మిది పట్టణాల్లో 45 షవర్ హెడ్ నమూనాలను సేకరించారు. క్షయ వ్యాధికి దారితీసే బాక్టీరియా ఉన్నట్టు వారు గుర్తించారు. తుంపర స్నానం చేసే వారిలో మూడొంతుల మందికి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడిన అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
ఏతావాతా తుంపర స్నానం కన్నా బకెట్ నీళ్ళతో స్నానం చేయడమే ఆరోగ్యానికి మంచిదని ఈ పరిశోధనల బృందం తెలిపింది. బకెట్ నీళ్ళలో కన్నా తుంపర నీళ్ళలో 100 రెట్లు బాక్టీరియా ఉంటుందట. బకెట్ లోని నీళ్ళను మగ్గు లేదా డబ్బాతో మనం పోసుకోవడం వల్ల తుంపర్లు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. దీనివల్లనే తుంపర స్నానం కన్నా బకెట్ నీళ్లతో స్నానం మేలని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ షవర్ బాత్ తప్పనిసరిగా చేయాల్సి వస్తే మొదటగా వచ్చే నీటిని ఒంటిపై పడకుండా చూసుకోవాలనీ మరీ జాగ్రత్తలు సూచిస్తున్నారు.
News Posted: 15 September, 2009
|