'ఎయిడ్స్ లేదని నిరూపించండి' చెన్నై : జంటలు వివాహానికి ముందే లైంగిక సామర్థ్యం పరీక్షలు జరిపించుకోవాలని సుప్రసిద్ధ తమిళ నటి మనోరమ సలహా ఇచ్చారు. పురుషులు, మహిళలు వివాహానికి ముందు మెడికల్ సర్టిఫికెట్లు చూపించడాన్ని తప్పనిసరి చేయాలని ఆమె సూచించారు. వరుని విషయంలోనైతే అతను తనకు లైంగిక సామర్థ్యం ఉందని నిరూపించుకోవాలని కూడా ఆమె సూచించారు.
'అతను లైంగిక సామర్థ్యం ఉన్నవాడని, హెచ్ఐవి లేనివాడని నిర్థారణ పత్రం ఉండాలి. ఇక మహిళల విషయంలో ఆమె మహిళ అని, గర్భం ధరించగలదని, హెచ్ఐవి లేదని సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ డాక్టర్ నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే, ఆయనను జైలులో పెట్టించాలి' అని మనోరమ అభిప్రాయం వెలిబుచ్చారు. తన ప్రతిపాదనలపై ఒక చట్టం కోసం ప్రచారోద్యమం సాగించేందుకు ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని మనోరమ యోచిస్తున్నారు. ఆమె సంకల్పం పట్ల వైద్యులు, హక్కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు చట్టం చేయడం పరిష్కార మార్గం కాదని వారు హెచ్చరిస్తున్నారు. 'శాసనం ద్వారా ఈ లక్ష్యం నెరవేరదు. విపరిణామాలు కూడా సంభవించవచ్చు. అసలు కన్యవేనా లేదా పెళ్ళికి తగినంత పరిణత మనస్కురాలివా అనేది నిరూపించేందుకు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించాలని యువతిని అడుగుతారు. ఇంకా పుష్పవతివి అయ్యావా లేదా అని కూడా అడుగుతారు. ఆమె తన మెడికల్ రికార్టులన్నీ సమర్పించాలని కూడా కోరతారు. ఇటువంటివన్నీ ప్రస్తావనకు వస్తాయి' అని పియుసిఎల్ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు సుధా రామలింగం పేర్కొన్నారు.
అసలు దేనికి సర్టిఫికెట్ ఉండాలో డాక్టర్లు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. 'మీరు ప్రస్తావించినట్లుగా ఎవరైనా ఒక సర్టిఫికెట్ ను ఆశిస్తున్నట్లయితే, అసలు వారు కోరుతున్నదేమిటి? లైంగిక సామర్థ్యం సర్టిఫికెటా? లేక సంతాన యోగ్యత సర్టిఫికెటా? ఏదైనా స్పష్టంగా తెలియాలి. ఇక రెండవ ప్రశ్న - ఇది లైంగిక సామర్థ్యం సర్టిఫికెట్ అని అనుకున్నట్లయితే, ఏ ప్రాతిపదికపైన దానిని ఇవ్వాలి. ఒక వ్యక్తి సమర్థుడా కాదా అనే విషయమై ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వవచ్చు' అని సెక్సువల్ మెడిసిన కన్సల్టెంట్ డాక్టర్ డి. నారాయణరెడ్డి అన్నారు.
ఏ వ్యక్తి అయినా స్వయంగా ఒప్పుకుంటే తప్ప వ్యక్తిగత లోపాలు, స్వలింగ సంపర్కంపై ఆసక్తి ఉండడం వంటి అంశాల గురించి చెప్పడం ఎంతో కష్టమని డాక్టర్లు అంటున్నారు. ఈ సమస్య గురించి జనంలో చైతన్యం తీసుకురావడం అవసరమేనని హక్కుల కార్యకర్తలు, వైద్యులు అంగీకరిస్తున్నప్పటికీ లైంగిక సామర్థ్యం నిర్థారణను తప్పనిసరి చేస్తూ శాసనం చేయాలనడం సబబు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, అలా చట్టం తీసుకురావలసిందిగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని మనోరమ కృతనిశ్చయంతో ఉన్నారు.
News Posted: 15 September, 2009
|