అబద్ధాల్లో పురుషులు ఫస్ట్ న్యూఢిల్లీ : తమ జీవిత భాగస్వాములు తమ కన్నా పెద్ద అబద్ధాలకోరులని మహిళలు ఎవరైనా చెబితే నమ్మండి. ఎందుకంటే, మహిళల కన్నా పురుషులే రెండింతలు అబద్ధాల చెబుతారని తాజా సర్వేలో వెల్లడైంది. డివిడిపై 'లై టు మి' సీజన్ 1 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ హోమ్ ఎంటర్ టైన్ మెంట్ నిర్వహించిన సర్వేలో తమ జీవిత భాగస్వామి, బాస్, తోటి ఉద్యోగుల వద్ద పురుషులు సగటున రోజుకు ఆరు అబద్ధాలు చెబుతుంటారని వెల్లడైంది. అంటే వారానికి 42, ఏడాదికి 2184, సగటు జీవిత కాలంలో 126672 అబద్ధాలను వారు చెబుతుంటారన్నమాట. అయితే, మహిళలు రోజుకు మూడు అబద్ధాలు మాత్రమే లేదా జీవిత కాలంలో 68796 అబద్ధాలు మాత్రమే ఆడతారు.
ఈ సర్వే ప్రకారం, పురుషులు, మహిళలు చెప్పే అబద్ధాలలో అగ్ర స్థానం 'ఏం లేదే, నేను బాగానే ఉన్నానే' అనే వాక్యానిది. 'ఎవరైనా అబద్ధం ఆడుతుంటే వారి బాడీ లాంగ్వేజే ఆ విషయాన్ని బయటపెడుతుంది' అని బాడీ లాంగ్వేజ్ ప్రవీణుడు రిచర్డ్ న్యూమాన్ చెప్పినట్లు 'ది డైలీ ఎక్స్ ప్రెస్' పత్రిక తెలియజేసింది. 'అయినప్పటికీ చాలా మంది సంకేతాలను గ్రహించలేరు. నిజం దాచాలనుకుంటున్నవారు ఎదుటి వ్యక్తుల కళ్ళలోకి నేరుగా చూడరని వారు భావిస్తుంటారు. కాని అది నిజంకాదు. అబద్ధాలకోరులు సాధారణంగా మిమ్మల్ని నమ్మించడానికి చేయవలసిందంతా చేస్తారు. కదలకుండా కూర్చుంటారు. మీ స్పందనను గమనించేందుకు మీ వైపే దృష్టి నిలుపుతారు' అని న్యూమాన్ వివరించారు. 'ముఖం తడుముకోవడం, కళ్ళు గబగబా ఆర్పడం ఎక్కువగా జనాన్ని పట్టిస్తాయి. అయితే, ప్రపంచంలో అగ్రశ్రేణి నిపుణుడు సైతం బాడీ లాంగ్వేజ్ ను బట్టి 85 శాతం అబద్ధాలను మాత్రమే పట్టివేయగలరు' అని ఆయన పేర్కొన్నారు.
అయితే, తమ జీవిత భాగస్వామి అబద్ధం చెబుతున్నదీ లేనిదీ తాము సులభంగా కనిపెట్టగలమని ప్రతి ఐదుగురిలో నలుగురికి పైగా చెబుతుంటారు. సగం మందికి పైగా తమ జీవిత భాగస్వామికి అబద్ధం చెబుతూ పట్టుబడిపోయారు. ఇక పాతిక శాతం మంది దంపతులు అబద్ధాల గురించే తగాదా పడుతుంటారు. ఏడు శాతం మంది ఆ కారణంగా విడిపోతుంటారు. తొమ్మిది శాతం మంది తాము పని చేసే చోట అబద్ధం చెబుతూ సమస్యల్లో చిక్కుకుంటుంటారు.
News Posted: 16 September, 2009
|