శ్మశానంలో జన్మదిన వేడుక నాగపూర్ : నలుగురూ నడిచే దారిలో మనమెందుకు నడవాలనే ఆలోచనతో కొందరు ఇతరులకు విడ్డూరంగా కనిపించే పనులను చేస్తుంటారు. నాగపూర్ వాసి ఒకరు సరిగ్గా ఈ కోవకే చెందుతారు. సదరు మనిషి తన 40వ జన్మదినోత్సవాన్ని ఒక శ్మశానవాటికలో జరుపుకున్నారు. సన్నిహిత మిత్రులు, బంధువులు చుట్టూ పరివేష్టించి ఉండగా ప్రమోద్ వాన్కెర్ బుధవారం గంగాబాయి ఘాట్ లో తన పుట్టిన రోజు కేక్ ను కట్ చేశారు. 'ప్రతి ఒక్కరూ నాకు ధైర్యం ఇచ్చారు. ఇది మంచి పని అని, సమాజానికి ఆదర్శమైన పని చేస్తున్నావని వారు నాతో అన్నారు. సాధారణంగా జనం తమ జన్మదిన వేడుకలను హోటళ్ళలో లేదా ఇళ్ళలో లేదా ఆలయం వంటి ప్రార్థనా మందిరాలలో జరుపుకుంటుంటారు. భవిష్యత్తులో విషాదాన్ని ఎదుర్కొనవలసిన ప్రదేశంలో నా పుట్టిన రోజును ఎందుకు జరుపుకోరాదని అనుకున్నాను' అని వాన్కెర్ వివరించారు.
వాన్కెర్ భార్య తొలుత ఈ విడ్డూర ఆలోచనను ఇష్టపడలేదు. కాని ఆయన వేదాంతపరంగా కారణాలు వివరించిన తరువాత ఆమె మనసులో సందేహాలు తొలగిపోయాయి. 'తన పుట్టిన రోజును ఒక శ్మశానవాటికలో జరుపుకోవాలని అభిలషిస్తున్నట్లు ఆయన నాతో చెప్పినప్పుడు నేను విస్మయం చెందాను. కాని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి నిష్క్రమించవలసి ఉంటుందని, అటువంటప్పుడు ప్రతి ఒక్కరూ పై లోకాన్ని చేరుకునే ప్రదేశానికి వెళ్ళి పుట్టినరోజును కూడా ఎందుకు జరుపుకోరాదని నేను భావించాను' అని ప్రమోద్ వాన్కర్ భార్య ఉష తెలియజేశారు. నాగపూర్ లో ఒక వ్యక్తి తన పుట్టిన రోజును ఒక శ్మశానవాటికలో జరుపుకున్న ఉదంతం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
News Posted: 17 September, 2009
|