మందు కొడితే చెట్టెక్కాలి వడోదర (గుజరాత్) : పీకల దాకా తాగితే ఎక్కేది మత్తే కాదు తాగినోళ్ళు చెట్టు కూడా ఎక్కాలి. మనం తాగినోళ్ళను చూసి 'చెట్టెక్కేశాడ'ని అంటాం. కాని అక్కడ మాత్రం నిజంగానే చెట్టెక్కాలి. అక్కడే కూర్చోవాలి. ఇరవై నాలుగు గంటలు దిగడానికి వీల్లేదు. కిక్కు దిగిపోయింది బాబో నేను కూడా దిగిపోతానంటే గ్రామం ఒప్పుకోదు. అంతేనా మందుబాబులు వెయ్యి రూపాయల తప్పుకూడా కట్టాలి. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేయడానికి గుజరాత్ లోని పట్నాతాలూకా కనేసర గ్రామ పెద్దలు కనిపెట్టిన మార్గం ఇది. తాగినోడికే కాదు సారా తయారు చేసేవారికి కూడా ఐదువేల రూపాయల జరిమానా విధిస్తామని ఆ గ్రామ సర్పంచ్ ఎ ఠాకూర్ చెప్పారు. అంతేనా తాగుబోతులెవరైనా మందు కొట్టడానికి కనేసర గ్రామానికి అతిధిగా వచ్చినా వెయ్యి రూపాయల జరిమానా తప్పదని ఆయన తెలిపారు. అదే గ్రామస్ధుడైతే వెయ్యి రూపాయలు జరిమానా కట్టడంతో పాటు ఓ చెట్టు శివారు కొమ్మ ఎక్కి కూర్చోవాలి. రోజంతా కిందకు రావడానికి వీలులేదు. మనోజ్ ఠాకూర్ అనే యువకుడు ఫుల్లుగా తాగి దొరికిపోయాడు. ఇంకెముందు చెట్టు శిక్ష తప్పలేదు. మరి జీవితంలో తాగనని, చెట్టు దిగేందుకు అనుమతి ఇవ్వాలని సర్పంచ్, ఇతర గ్రామస్థులను వేడుకున్నా ఫలితం లేకపోయింది.
News Posted: 21 September, 2009
|