పండగ సరదాయే లేదు హైదరాబాద్ : నవరాత్రి ఉత్సవాలను తెలుగువారి సంప్రదాయ రీతులలో జరుపుకోవడమనేది అంతకంతకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. ఈ పండుగ సమయంలో ప్రతి తెలుగు వారింట ఒకప్పుడు కానవచ్చిన బొమ్మల కొలువు గాని, రాష్ట్రమంతటా వీధులలో జనానికి వినోదం కలగజేసే దసరా వేషగాళ్ళు గాని ఇప్పుడు కనిపించడం కద్దు. అయితే, కొన్ని కుటుంబాలు పూజలు, యాగాలు నిర్వహించడమనే తరతరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ పండగ ఉత్సాహమే అంతరించిపోతున్నదని వారు ఒప్పుకుంటున్నారు.
'చిన్నతనంలో బొమ్మల కొలువు కోసం ఏడాది పొడుగునా బొమ్మలు సేకరిస్తుండడం నాకు ఇప్పటికీ గుర్తు. పండగకు ముందు మేము ఆ బొమ్మలకు దుస్తులు తొడగడానికి, ఇంటిని అలంకరించడానికి మా సమయాన్ని ఎక్కువగా వెచ్చించేవారం' అని పాతతరం మహిళ ప్రమీలా దేవి పాత రోజులను గుర్తు చేసుకుంటూ చెప్పారు. 'దురదృష్టవశాత్తు మా తరువాతి తరాలవారికి ఈ సంప్రదాయాన్ని పాటించడానికి తీరికా ఉండడం లేదు, ఆ ఆలోచనా ఉండడం లేదు' అని ఆమె అన్నారు.
తెలుగువారికి, ముఖ్యంగా గ్రామాలలో కుటుంబ సభ్యులంతా తిరిగి సరదాగా గడపడానికి దసరా ఒక అవకాశం కల్పిస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలలో, చివరకు గ్రామాలలో కూడా ఒకప్పటి పండగ ఉత్సాహం అంతరించిపోతున్నదని వారంటున్నారు. పులి వేషాలు లేదా ఇతర వేషాలతో వీధులలోకి వచ్చి ఆటపాటలతో జనాన్ని అలరించి దసరా మామూళ్ళు వసూలు చేయడమనేది కొన్ని చోట్ల కనిపిస్తున్నా పండగ వచ్చింది, ఇలా చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణే ఎక్కువగా కానవస్తున్నది. 'పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడమనేది అరుదైపోయింది. ఒకప్పుడు సామాజిక ఉత్సవంగా సాగే ఈ పండగ ఇప్పుడు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికే పరిమితమై పోతున్నది' అని హైదరాబాద్ పశ్చిమ మారేడ్ పల్లి వాసి ఎస్. ప్రసాద్ వ్యాఖ్యానించారు.
తీరిక తక్కువగా ఉండే కుటుంబాలు దసరాను వేడుకగా జరుపుకోలేకపోతున్నాయి. కాని కొందరు ఇప్పటికి సాంప్రదాయకంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, కొన్ని మార్పులతో వారు వీటిని జరుపుకుంటున్నారు. ఉదాహరణకు, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక ఇప్పుడు ఇంటి నాలుగు గోడలకే పరిమితమవుతున్నది. 'గతంలో మేము బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తుండేవారం. ఇప్పుడు ఆ ఏర్పాట్లు ఇంటిలోనే చేసుకుంటున్నాం' అని నాగేశ్వరరావు అనే నగరవాసి చెప్పారు.
News Posted: 25 September, 2009
|