నిర్బంధ బ్రహ్మచారులు! ఫరీద్ కోట : పంజాబ్ లో పెళ్ళి ఈడు దాటిపోయిన పురుషుల సంఖ్య ఇప్పటికే దాదాపు 30 లక్షలు ఉంది. 15 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపు కావచ్చు. రాష్ట్రంలో పురుషులు, మహిళల నిష్పత్తి దారుణంగా పడిపోవడంతో స్థానికంగా వధువులకు కొరత ఏర్పడనుండడమే ఇందుకు కారణమని ప్రముఖ సంఘ సేవిక ఒకరు శుక్రవారం ఫరీద్ కోటలో తెలియజేశారు.
'పదిహేను సంవత్సరాల అనంతరం దాదాపు 60 లక్షల మంది యువకులు అవివాహితులుగానే మిగిలిపోగలరని చివరకు యునిసెఫ్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆ యువకులకు పెళ్ళి చేసుకోవడానికి యువతులే దొరకకపోవచ్చునని యునిసెఫ్ సూచించింది.' అని సంఘ సేవిక డాక్టర్ హర్షిందర్ కౌర్ తెలియజేశారు. బాబా ఫరీద్ అగ్మన్ పర్వ్ వేడుకల సందర్భంగా విశిష్ట సామాజిక సేవకు గాను ఆమెకు భగత్ పూరన్ సింగ్ అవార్డును ప్రదానం చేశారు.
భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించి ప్రశంసలు అందుకున్న డాక్టర్ కౌర్ ఇంకా మాట్లాడుతూ, పంజాబ్ లో స్త్రీపురుషుల నిష్పత్తి ఈ సంవత్సరం మెరుగుపడిందని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, వెయ్యి మంది బాలురకు 874 మంది బాలికలు ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసిందని, ఆయితే, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోఐదేళ్ళ బాలురు ప్రతి వెయ్యి మందికి అదే వయస్సు బాలికలు 357 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. పటియాలా - చండీగఢ్ రోడ్డులోని గ్రామాలలో నిర్వహించిన సర్వేలోను, అమృతసర్, జలంధర్ నగరాలలోని అన్ని ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలోను ఐదేళ్ల వయో వర్గంలో బాలికల నిష్పత్తి బాగా తక్కువగా ఉన్నట్లు వెల్లడైందని ఆమె తెలిపారు. ఈ సర్వేల ప్రకారం ఐదేళ్ళ వయో వర్గంలో ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 357 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడైందని ఆమె చెప్పారు.
మహిళల నిష్పత్తి ఇంత తక్కువగా ఉండడానికి కారణాలు తెలుసుకొనడానికి కనీసం 183 గ్రామాలలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, వందలాది మంది మహిళలతో సాగించిన ముఖాముఖి ప్రకారం గృహహింసతో సహా మహిళలపై జరుగుతున్న నేరాలు, వరకట్నం ఇందుకు ప్రధాన కారణాలని కనుగొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల రికార్డుల ప్రకారం, ఒపి, ఇన్ పేషెంట్ వార్డులలోను, వాక్సినేషన్ వార్డులోను ఆడ శిశువల సంఖ్య బాలురలో మూడింట దాదాపు ఒక వంతు ఉన్నట్లు విదితమవుతున్నదని డాక్టర్ కౌర్ పేర్కొన్నారు.
News Posted: 26 September, 2009
|