అక్కడ రావణుని పూజిస్తారు కల్పి (జలౌన్, ఉత్తర ప్రదేశ్) : దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా రావణుని దిష్టిబొమ్మను దగ్ధం చేసే సంప్రదాయాన్ని ఉత్తర ప్రదేశ్ జలౌన్ జిల్లా కల్పి పట్టణంలో పాటించరు.కాని పురవాసులు ఆ రాక్షస చక్రవర్తి భక్తులు కొందరు అతనిని పూజిస్తారు. వారు రామలీల వేడుకను జరుపుతారు. కాని రావణ భక్తులైన కుటుంబ సభ్యులకు చివరలో ఆ 'మేధావి' దిష్టిబొమ్మను దగ్ధం చేయడంలో విశ్వాసం లేదు. వారు రామలీలను నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. తరతరాలుగా ఆ కుటుంబం రామలీలను నిర్వహిస్తున్నది. కాని రావణుని దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బదులు వారు అతని పూజతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు.
శ్రీరామునిపై కూడా అపార భక్తి విశ్వాసాలు ఉన్న ఆ కుటుంబం అనాదిగా వస్తున్న ఆ సంప్రదాయంలో సూత్రాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. 'రావణుడు దుర్మార్గుడు కాడు. మేధావి' అని వారు వాదిస్తుంటారు. రావణునికి మంచి రాజకీయ విజ్ఞత ఉందని, ఇంకా కొన్ని మంచి గుణాలు ఉన్నాయని వారు విశ్వసిస్తుంటారు.
ఆ కుటుంబం పూర్వీకులు 1875లో 210 అడుగుల ఎత్తైన ఒక స్తంభం (మినార్)ను నిర్మించి రావణునికి అంకితం చేశారు కూడా. ఆ స్తంభానికి ముందు ఒక శివాలయాన్ని కూడా నిర్మించారు. ఆ కుటుంబంలో సీనియర్ సభ్యుడైన బ్రిజేంద్ర కుమార్ నిగమ్ (76) ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'మా పూర్వీకులు రావణుని స్మృత్యర్థం ఆ స్తంభాన్ని కట్టించారు. అప్పటి నుంచి మేము రామలీల నిర్వహిస్తున్నాం' అని తెలియజేశారు. 'మా పూర్వీకులు లంకేశుడు అంతటి ప్రముఖులు అయ్యారు. వారు స్వయంగా రావణ పాత్రను పోషిస్తుండేవారు' అని ఆయన తెలిపారు. తమ పెద్దల అభిప్రాయాలతో నిగమ్ ఏకీభవిస్తూ, రావణుడు గొప్ప మేధావి అని అందువల్ల అతనిని పూజించాలని అన్నారు. రావణుని అంతిమ ఘడియల్లో అతని బోధలు అందుకోవలసిందని తన తమ్ముడు లక్ష్మణుడిని శ్రీరాముడు కూడా కోరినట్లు నిగమ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
News Posted: 29 September, 2009
|