మోడల్ అయిన 'మిలిటెంట్'! న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఫ్యాషన్ వర్గాలలో విశిష్ట ఖ్యాతి గడించిన కాశ్మీరీ తారీక్ అహ్మద్ దార్ గ్లామర్ జీవితం మూడు సంవత్సరాల క్రితం అర్ధంతరంగా అడ్డం తిరిగిపోయింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్లుండి దార్ ను భారతీయ గూఢచారిగా ప్రకటించి అరెస్టు చేసింది. తదనంతరం కొద్ది రోజుల పాటు రకరకాల పద్దతులలో ఇంటరాగేషన్ చేసి, అతను గూఢచారిగా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకనందున భారతదేశానికి తిప్పి పంపివేసింది. దార్ దేశానికి చేరుకున్న మరుక్షణమే భారతీయ అధికారులు ఆయనను లష్కర్-ఎ-తయ్యెబా కార్యకర్తగా అనుమానించి తమ నిర్బంధంలోకి తీసుకున్నారు.
వారు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు, చిత్రవధకు గురి చేశారు. కాని తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆయనను విడుదల చేయవలసి వచ్చింది. జైలులో నుంచి బయటకు వచ్చిన దార్ గుండె దిటవు కోల్పోకుండా తనకు అలవాటైన జీవితాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. ఈ దఫా ముంబైలో ఈ జీవితం సాగించాలని ఆయన అనుకున్నారు. గతంతో నిమిత్తం లేకుండా ముంబై ఆయనకు సాదరపూర్వక స్వాగతం పలికింది. ఆయన అడ్వర్టైజ్ మెంట్ చిత్రాల కోసం పని చేయనారంభించారు. వాటిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చిత్రం కూడా ఉన్నది. 'షారుఖ్ ఖాన్ ను కలుసుకునేందుకు, యష్ రాజ్ స్టూడియోస్ లో షూటింగ్ కు అవకాశం లభించినందుకు నాకు అమితానందం కలిగింది' అని దార్ మీడియాతో చెప్పారు.
2006లో దార్ ఎదుర్కొన్న పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నమైనది. 2006 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 25 వరకు 40 రోజుల పాటు ఆయన బంగ్లాదేశ్ జైలులో గడిపారు. ఆతరువాత రెండు నెలల పాటు ఆయన ఢిల్లీ జైలులో గడిపారు. 2007 జనవరిలో కోర్టు ఉత్తర్వుతో దార్ కు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అయితే, దార్ భారతీయ వ్యవస్థలో విశ్వాసాన్ని కోల్పోలేదు. 'నాకు అండగా నిలచినవారు, నా కాళ్ళపై నేను తిరిగి నిలబడడానికి దోహదం చేసినవారు ఎందరో ఉన్నారు' అని దార్ చెప్పారు.
News Posted: 1 October, 2009
|