ఒకే వ్యక్తికి 2 మరణశిక్షలు! ఇడుక్కి (కేరళ): దేశంలోనే అరుదైన తీర్పులలో ఇది ఒకటి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం రెండు వేర్వేరు హత్య కేసులలో ఒకే వ్యక్తికి మరణ శిక్షను, సాక్ష్యాధారాలను రూపుమాపినందుకు, తన పొరుగింటి వ్యక్తిపై దాడి చేసినందుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. రెండు వేర్వేరు హత్య కేసులలో నిందితుడు కొణక్కల్ జొమొన్ (23)కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి కె.ఆర్. జీనన్ ఒకే రోజు మరణశిక్ష విధించారు.
మొదటి కేసులో నిందితుడు జొమొన్ తన తల్లి మేరీ (53)ను, తాత జోసెఫ్ (88)ని హత్య చేశాడు. రెండవ కేసులో అతను తన పొరుగింటివారైన ఒంతుపరయిల్ దామోదరన్ (78)ని, ఆయన కోడలు శాంత (38)ని హతమార్చాడు. ఇడుక్కి జిల్లా కణ్ణతడి పంచాయతీలోని ముక్కుడం గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. ఒక్క రోజులో ఒకే వ్యక్తి ఒక కోర్టు రెండు ఉరి శిక్షలు విధించడమనేది దేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే అరుదైనదిగా పేర్కొంటున్నారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, తనకు దూరంగా నివసిస్తున్న తన తల్లిని, తాతను 2002 సెప్టెంబర్ 2న డబ్బు గురించిన వాదన పర్యవసానంహా జొమొన్ హత్య చేసి, సాక్ష్యాధారమేదీ లేకుండా చేయడానికై గ్యాస్ స్టవ్ ను అంటించాడు. ఈ ప్రక్రియలో 40 శాతం వరకు తన శరీరంపై కాలిన గాయాలకు గురైన జొమొన్ తన పొరుగింటిలోని దామోదరన్ వద్దకు వెళ్ళి ఆసుపత్రికి చేరేందుకు ఒక ఆటోరిక్షాను ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు.
ఆటో రిక్షాను తీసుకురావడానికి దామోదరన్ కుమారుడు వెళ్ళగా, కాలిన గాయాల గురించి అతనిని అడిగి, తమ ఇంటి పక్కన ఇతర గృహస్థులకు ఈ విషయం తెలియజేయాలని దామోదరన్ నిర్ణయించుకున్నారు. దీనితో జొమొన్ ఆగ్రహించి దామోదరన్, శాంతలను నరికి చంపాడు. దామోదరన్ ఇంటికి వెళ్ళే ముందు జొమొన్ మరొక పొరుగింటి వ్యక్తిపై దాడి జరిపాడు. మీ తల్లి ఎక్కడ ఉందని అడిగినందుకు ఆ వ్యక్తిపై జొమొన్ దాడి చేశాడు. జొమొన్ ఈ పైశాచిక కృత్యం సాగించినప్పుడు మానసికంగా స్వస్థుడేనని నిస్సందేహంగా రుజువైందని కోర్టు ఈ తీర్పు వెలువరిస్తూ తెలియజేసింది.
News Posted: 7 October, 2009
|