అమ్మా! నువ్వెక్కడ? హైదరాబాద్ : పేగుబంధం ఓడిపోయింది. మాతృ హృదయం కఠినశిలగా మారిపోయింది. రక్తం పంచి, నవమాసాలు మోసిన అనుబంధం అమానుషాన్ని ప్రదర్శించింది. అనురాగానికి ప్రతిరూపంగా అప్పుడే పురుడుపోసుకున్న తమ చిన్నారులను ఆస్పత్రుల్లోనే వదిలేసి గాయబ్ అయిపోయారు. ఇద్దరు తల్లులు పిల్లలకు ముఖం చాటేసి పారిపోగా, ఒక తల్లి ఆస్పత్రిలోనే అనారోగ్యంతో అసువులు బాసింది.
అప్పుడే ఈ భూమ్మీద పడిన ఈ ముగ్గురు పసికందులు తల్లుల్లేక తల్లడిల్లుతున్నారు. వారిలో ఇద్దరు ఆడబిడ్డలు కాగా, మరొకరు మగశిశువు. ఆకలితో ఆ బిడ్డలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. అయినా వాళ్ళ తల్లులకు ఆ విషయం తెలియదు. ఒకవేళ తెలిసినా పట్టించుకోలేదేమో. తల్లి ఒడిలో సుఖంగా ఉండాల్సిన ఆ బిడ్డలు ఆస్పత్రుల వార్డుల్లో అలో లక్ష్మణా అంటూ ఏడుస్తున్న తీరు చూపరుల మనసులను కలచివేసింది. ఆ పసికందులకు జన్మనిచ్చిన తల్లుల గురించి ఆరా తీసిన మీడియాకు అవాక్కయ్యే నిజాలు తెలిశాయి. ఆ ముగ్గురు పసికందుల్లో ఇద్దరి తల్లులు వారిని పుట్టిన కొద్దిసేపటికే ఆస్పత్రుల్లో వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయారు. మరొక తల్లి పాపం ఈ భూమ్మీద నుంచే వెళ్ళిపోయింది. ఈ హృదయ విదారక సంఘటనలు బుధవారంనాడు రాష్ట్ర రాజధానీ నగరం హైదరాబాద్ లోని నీలోఫర్, సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో సైదాబాద్ కు చెందిన నీరజ ఆడపిల్లను ప్రసవించింది. ఆ వెంటనే ఇప్పుడే వస్తానంటూ లేబర్ వార్డు నుంచి ఆమె మాయమైపోయింది. నీరజ పారిపోయిన విషయం గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ళ కావేరి ఈ నెల 5ల రెండో కాన్పు కోసం సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి 12.35 గంటలకు ఆమె మగ బిడ్డను ప్రసవించింది. అయితే బిడ్డను సిబ్బంది లేబర్ రూమ్ లోని పిల్లల వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం ఉదయం 6 గంటలకు కావేరి టాయిలెట్ కని చెప్పి వెళ్ళి కనిపించకుండా పోయింది. ఆస్పత్రి సిబ్బంది ఎంత వెతికినా ఆమె కనిపించకపోవడంతో బిడ్డను నీలోఫర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. బిడ్డ తల్లి గురించి నీలోఫర్ వైద్యులు నిలదీయగా శిశువును వదిలిపెట్టి తల్లి వెళ్లిపోయిందని చెప్పారు. దీనితో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావలని సూచించారు. వారి సూచన మేరకు సుల్తాన్ బజార్ ఆస్పత్రి సిబ్బంది నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త గణేష్ మరణించినట్లు ఆస్పత్రి రికార్డుల్లో కావేరి రాయించింది.
మూడో సంఘటనలో కరీంనగర్ కు చెందిన మహిళ ఈ నెల 5వ తేదీన నీలోఫర్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత అనారోగ్యంతో మరణించింది. ఈమె భర్త ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నాడని తెలుస్తోంది. పసికందుకు సహాయకుడిగా వచ్చిన మేనమామ సత్యనారాయణ ఎవరికీ చెప్పకుండా వార్డు నుంచి గాయబ్ అయ్యాడు. దీనితో ఈ బిడ్డ కూడా అనాథగా మారింది. ఆస్పత్రి ఆర్ ఎంఓ జ్యోతిబాయి ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి, శిశువులను శిశువిహార్ కు అప్పగించారు. ప్రస్తుంతం ఈ ముగ్గురు బిడ్డల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
News Posted: 8 October, 2009
|