ఆమెకు 57- అతనికి 19 లక్నో : మనువు చేసుకునేందుకు వయసుతో పనేముంది! మనసుతో కానీ అనుకున్నారా జంట! పెళ్ళనగానే ఈడూ - జోడూ చూడటం పరిపాటి. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ జంట 'నీకూ నాకూ జత కుదిరింది - చల్ మోహనరంగా' అంటూ గీతాలు పాడుకున్నారు. కాదని వ్యతిరేకించిన వారి నోళ్ళు మూయించేందుకు ఏకంగా వివాహమే చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో లక్నోకు 90 కిలోమీటర్ల దూరంలోని గ్రామం (సీతాపూర్ జిల్లా)లో ఈ సంఘటన జరిగింది. 57 ఏళ్ళ జానకి నాలుగేళ్ళ క్రితం భర్తను కోల్పోయింది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, నలుగురు కొడుకులు. వారిలో ఇద్దరికి వివాహమైంది. భర్తపోయినప్పటి నుంచి జానకిని ఆమె కొడుకులు పట్టించుకోవడం మానేశారు. ఆమె అవసరాలు పట్టించుకోలేదు. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ళ దినేష్ తో ఆమెకు పరియచం ఏర్పడింది. తన బాధలను ఆమె దినేష్ తో మొరపెట్టుకునేది. ఈ క్రమంలో వారిద్దర మధ్య సన్నిహితం పెరిగింది. ఆమె 'ప్రేమ'లో పడిన దినేష్ వివాహం చేసుకుంటానన్నాడు. నెలన్నర క్రితం వారిద్దరి సాన్నిహిత్యాన్ని గమనించిన ఆమె కుమారులు దినేష్ పై దాడి చేశారు. మరోసారి వారిద్దరి 'భేటీ'ని చూసిన కొడుకులు తల్లిని దండించారు! ఈ గలాటలోనే చేతికి గాటు పెట్టుకున్న దినేష్... ఆ రక్తంతో జానకి నొసట తిలకం దిద్దాడు. ఇక మీదట తాము భార్యాభర్తలమని స్పష్టం చేశారు! 'కొత్త' దంపతులను వారి కుటుంబాలు ఆశీర్వదించకపోయినా - కొందరు గ్రామస్తులు వారిని చేరదీశారు.
News Posted: 21 October, 2009
|