రాఖీని ఓడించిన రాహుల్ న్యూఢిల్లీ : ఎన్ డిటివి ఇమాజిన్ చానెల్ లోని 'రాహుల్ దుల్హనియా లే జాయెగా' రియాలిటీ షో ద్వారా తన జీవిత భాగస్వామిని కనుగొనాలని నిర్ణయించుకున్న రాహుల్ మహాజన్ కు ఫోన్, ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా 16.755 ఎంట్రీలు వచ్చినట్లు చానెల్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. 'ఈ స్పందన నాకు సంతుష్టి కలిగించింది. నా జీవిత భాగస్వామిని కనుగొనేందుకు ఎదురుచూస్తున్నాను. ఆమెతో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించగలను' అని రాహుల్ తెలిపారు. సినీ తార రాఖీ సావంత్ ఇటువంటి రియాలిటీ షో ద్వారా నిర్వహించిన స్వయంవరానికన్నా రాహుల్ కార్యక్రమానికే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయి.
డాక్టర్లు, ఇంజనీర్లు వంటి ప్రొఫషనల్స్ నుంచి విద్యార్థులు, కళాకారుల వరకు 22, 36 ఏళ్ళ వయోవర్గంలోని వివిధ రంగాల యువతులు ఆ 34 ఏళ్ళ యువకుని ప్రేమను చూరగొనగలమనే ఆశతో తమ వివరాలు పంపారు. ఎంట్రీలకు గడువు బుధవారం ముగిసింది. ఢిల్లీ నుంచి అత్యధిక సంఖ్యలో 5063 ఎంట్రీలు వచ్చాయి. ఆతరువాత ముంబై 4188 ఎంట్రీలతో ద్వితీయ స్థానం ఆక్రమించింది. కోలకతా, లక్నో, చండీగఢ్, జైపూర్, నాగపూర్, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి ఎంట్రీలు అందాయి. ఇంకా దుబాయి, లండన్, అమెరికా నుంచి ఎన్ఆర్ఐ యువతులు కూడా తమ వివరాలను పంపారు.
బహుశా నవంబర్ లో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షోలో అనువైన వధువు కోసం రాహుల్ జరిపే అన్వేషణ ఫలప్రదం కావచ్చు. కుదించిన జాబితాలోని యువతులతో దేశవ్యాప్తంగా ఆడిషన్ ప్రక్రియ, ఆతరువాత వివిధ నగరాలలో సమావేశాలు,ఇంటర్వ్యూల ప్రక్రియను నిర్వహిస్తారు. 'బిగ్ బాస్ 2' రియాలిటీ షో అనంతరం వినోద ప్రదర్శన రంగంలో అందరికీ తెలిసిన రాహుల్ మహాజన్ కు ఇది రెండవ వివాహం.
రాహుల్ ఇంతకుముందు 2006లో శ్వేతను వివాహం చేసుకున్నారు. వారిద్దరు క్రితం సంవత్సరం విడిపోయారు.
News Posted: 23 October, 2009
|