జీతం 20 రూపాయలే! రూపాయి విలువ పడిపోయిన ఈ రోజుల్లో 20 రూపాయలకు ఏం వస్తుంది... మార్కెట్ లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు కూడా రావు. కూరగాయలు సరేసరి.. మహా అయితే గీచిగీచి బేరం ఆడితే... ఓ రకమైన అరటి పళ్ళు డజను లేదంటే పది పళ్ళు మాత్రమే వస్తాయి. కానీ రాజస్థాన్ లోని బలపుర గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో జగదీష్ శర్మ నెలవేతనం మాత్రం అక్షరాలా 20 రూపాయలే! అదీ ఎప్పటి నుంచో తెలుసా! 1986 నుంచి... అంటే 23 ఏళ్ళుగా అతను ఈ మొత్తమే నెలవారీ జీతంగా జీవితాన్ని గడిపాడు!
రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక వేతనంపై ఫ్యూన్ గా పనిచేస్తున్న పాఠశాల ప్రారంభం, ముగింపు సమయాల్లో గంట మోగిస్తాడు. ఎప్పటికప్పుడు తన వేతనం పెంచాలని జగదీష్ ఎందరికి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నిరక్షరాస్యుడైన ఈ పేదవాడి మొర ఎవరు గుండెల్నీ 23 ఏళ్ళుగా కరిగించలేదు. 'నేను పాఠశాలను శుభ్రం చేస్తాను. గంట కొడతాను. జీతం పెంచుతారని ఆశపడ్డాను. నాబోటి పేదవాడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను' అని జగదీష్ ఆవేదన చెందాడు. వేతనాల పట్టీలో నీళ్ళు తెచ్చే పనివాడుగా జగదీష్ ను పేర్కొన్నారు.
కానీ... అవసరమైనప్పుడు వంట పాత్రలను కూడా అతనే తోమేసేవాడు. ఆయన ఎంత అంకిత భావంతో పనిచేసినా వేతనం పెరిగే దారి కనిపించలేదు. పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రకాష్ బైరా మాట్లాడుతూ, 'ఆయన 20 ఏళ్ళుగా 20 రూపాయల వేతనానికి పనిచేస్తున్నాడు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో అతని పేరు తీసేశారు' అని చెప్పారు. 23 ఏళ్ళపాటు నెలకి 20 రూపాయాలు మాత్రమే చెల్లించి... ఇప్పుడు ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో... జగదీష్ కోర్టు కెక్కాడు. ఈ కేసులో ఒక నిర్ణయానికి వచ్చే వరకూ ఉద్యోగం నుంచి తొలగించవద్దని కోర్టు ఆదేశించింది. అన్నట్టు... తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగాన్ని పదేళ్ళు చేసిన వారిని ఇటీవలే గెహ్లాట్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. కానీ... జగదీష్ కు మాత్రం మోక్షం కలుగలేదు.
News Posted: 27 October, 2009
|