మనసెరిగేది మగువే 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' అన్న మాటేమో కానీ... వారు మాటల్లో మర్మాన్నీ, దాగున్న భావాలను మాత్రం ఇట్టే పట్టేస్తారనడంలో సందేహం లేదు. రుసరుసలైనా... గుసగుసలైనా... పుల్లవిరుపు మాటలైనా... సరే మాటా-మంతిలో లో'గుట్టు'ను ఇట్టే పట్టేస్తారు. ప్రత్యేకంగా భయాందోళనలను, విసుగును తేలికగా పసిగడతారని ఆన్ లైన్ జర్నల్ - న్యూరో సై కాలజీలో ఒక సర్వే ప్రచురితమైంది. ఈ మేరకు ఆలీవర్ కోలింగ్ నన్, 'సెర్నెక్' (యూనివర్శిటీ డి మాంట్రియల్ సెంటర్ డె రీసెర్చ్ ఎన్ న్యూరో సైకాలజీ ఎట్ కాగ్నీషన్) బృందం సర్వే చేసింది. శ్రవణం, దృశ్యం, దృశ్యశ్రవణాల్లో భావాలను పసిగట్టడంలో మగవారికన్నా మహిళలే చురుగ్గా ఉంటారని ఈ బృందం తేల్చింది.
బెల్జియంలోని న్యూరో సైన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన కోలింగ్ లున్ మాట్లాడుతూ, భావాలను ప్రకటించడంలో ముఖ కవళికలే ప్రధానమని చెప్పారు. వారి అధ్యయనంలో భాగంగా రికార్డింగ్ తో ఉన్న నటుల హావభావాలను ప్రదర్శించారు. 18 నుంచి 43 ఏళ్ళ లోపు 23 మంది పురుషులు, 23 మంది మహిళలకు ఆయా ప్రదర్శనలు వేసి... భావాలను గుర్తించాలన్నారు. ఎంపిక చేసిన మహిళలు, పురుషుల్లో ఎవరికీ నరాలకు సంబంధించిన ఇబ్బందులు లేవు. విసుగు, భావాలను త్వరగా గుర్తించాలని వీరికి పరిశోధకులు సూచించారు.
విసుగునూ, భయాన్ని ప్రదర్శించడంలో కానీ, గుర్తించడంలోనూ స్త్రీలు ముందంజలో ఉన్నట్లు ఈ పరిశోధనలో తేల్చారు. స్త్రీ, పురుషుల్లో ఎవరు గొప్ప అన్న విషయాన్ని తేల్చాలని ఈ అధ్యయనం నిర్వహించలేదని కోలింగ్ లున్ తెలిపారు. మానసిక మనో వ్యాధులను స్త్రీ, పురుషులలో గుర్తించేందుకు ఈ సర్వేలు దోహదం చేస్తాయని భావిస్తున్నామని చెప్పారు.
News Posted: 28 October, 2009
|