నేరం జన్యువులదే! వేగంగా వాహనాలను నడిపేవారు, ట్రాఫిక్ నియమాలను తరచూ ఉల్లంఘించేవారు, ప్రమాదాలకు కారకులయ్యే డ్రైవర్లు... ఇకపై ఈ నేరాలను తమపై వేసుకోనక్కరలేదు. 'ఈ నేరం నాది కాదు - జన్యువులదే'నని వాదించవచ్చు! ప్రత్యేకమైన జన్యువుగల వారిపై ఇర్విన్ యూనివర్శిటీ పరిశోదకులు చేసిన అధ్యయనంలో డ్రైవింగ్ లో జరిగే పొరపాట్లకు ఈ జన్యువులే మూలమని తేలింది. ప్రత్యేక జన్యువులేని వారి కన్నా ఉన్నవారిలో 20 శాతం అధికంగా డ్రైవింగ్ పొరపాట్లకు అవకాశం ఉందని అంచనా వేశారు.. కొన్ని రోజుల తరువాత నిర్వహించిన పరీక్షలో కూడా ఈ ఫలితాలే వచ్చాయి. 30 శాతం మంది అమెరికన్లకు ప్రత్యేక జన్యువు ఉందని సైన్స్ డైలీ వెబ్ సైట్ పేర్కొంది.
'ప్రజలు సాగించే రాకపోకల్లో కొన్ని తప్పులు చేస్తారు. వారు నేర్చింది కొంత కాలానికే మర్చిపోతారు' అని అధ్యయనకర్త - న్యూరాలజీ ప్రొఫెసర్ స్టీవెన్ క్రామర్ తెలిపారు. మెదడుకు అందిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి, తిరిగి అవసరమైనప్పుడు అందించడంలో బీడీఎన్ఎఫ్ (బ్రెయిన్ - డిరైవ్ డ్ న్యూరో ట్రోఫిక్ ఫ్యాక్టర్) కీలకమైంది. ఈ బీడీఎన్ఎఫ్ లభ్యతను ప్రత్యేక జన్యువు పరిమితం చేస్తుంది. ప్రత్యేక జన్యువుగల వ్యక్తులకు గుండెపోటు వస్తే తిరిగి కోలుకోలేదని కూడా కొందరు అధ్యయన కారులు గుర్తించారు. కాగా డ్రైవింగ్ లో ప్రత్యేక జన్యువు ప్రభావాన్ని గుర్తించేందుకు ఇరవై తొమ్మిది మందిని ఎంపిక చేశారు. వీరిలో ఇరవై రెండు మందికి ప్రత్యేక జన్యువు లేదు. డ్రైవింగ్ మార్గంలో వంకరలు, మలుపులు ఎక్కువగా ఉన్న దారిని ఎంపిక చేశారు. ఈ మార్గంలో డ్రైవర్ల ప్రయాణాన్ని చిత్రీకరించారు. నాలుగు రోజుల తరువాత మళ్ళీ ఈ పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితాలు మాత్రం మారలేదు. ఇతరుల కన్నా ప్రత్యేక జన్యువు గలవారు ఎక్కువగా పొరపాట్లు చేసినట్లు తేలిందని అధ్యయన శాస్త్రవేత్తలు వివరించారు. ఈ మేరకు ఫలితాలు సెరెబ్రెల్ కోర్టెన్స్ జర్నల్ లో ఇటీవల ప్రచురితం అయ్యాయి.
News Posted: 30 October, 2009
|