కొబ్బరితో సుగర్ ముప్పు
త్రివేండ్రం : మనం రోజూ ఆహారంలో వినియోగించే వంట నూనెల్లో కొవ్వు శాతాలను వివరిస్తూ కేరళలోని ప్రతీ ఆసుపత్రుల్లోనూ పట్టికలు దర్శనమిస్తాయి. అందులో కొబ్బర నూనెదే అగ్రస్థానం. కేరళ ప్రజలు ఆది నుంచి కొబ్బరి నూనెనే వంటలకు ఉపయోగిస్తారు. కానీ ఇది ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో మధుమేహ వ్యాధి ప్రబలిపోవడానికి కొబ్బరి నూనే కారణమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కేరళలో బతికే ప్రతీ వంద మందిలో 21 మందికి మధుమేహ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మన దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో కేరళ అగ్రస్థానంలో ఉంది.
కేశవదేవ్ ట్రస్ట్ నిర్వహించిన సర్వేలో ఈ నిజం నిగ్గు తేలింది. మధుమేహం పై అవగాహన ప్రచారం నిర్వహించే ఈ ట్రస్ట్ అంచనా ప్రకారం ఆరేళ్ళ కాలంలోమధుమేహం రోగం బారిన పడే సగటు వయసు ఒక్కసారిగా తగ్గిపోయింది. 34 ఏళ్ల వయస్సు వారికి కూడా ఇప్పుడు మధుమేహం వచ్చేస్తోంది. ఇందుకు కారణం - కొబ్బరి నూనె వినియోగమేనని ఈ ట్రస్ట్ చెబుతోంది. కొబ్బరి నూనెతో చేసిన వేపుళ్ళును కేరళ యువతీ యువకులు ఎక్కువగా తినడం వల్ల కొలెస్టరాల్ పెరుగుతోంది - ఇదే 70 శాతం మందిలో మధుమేహం రావడానికి కారణం అవుతోంది.
'కేరళ యువతతో 300 శాతం కొలెస్టరాల్ అధికంగానే ఉందని మధుమేహ వైద్య నిపుణుడు డాక్టర్ జ్యోతిదేవ్' వెల్లడించారు. హాని చేసే కొవ్వులు రక్తంలో పెరిగిపోవడం, రక్తపోటు అధికం కావడానికి యువత గుర్తించలేకపోవడం చాలా ప్రమాదకరమైన పరిణామమని ఆయన అన్నారు. 36 ఏళ్ళ బిందుకు మధుమేహం ఉన్నట్టు మూడేళ్ళ క్రితమే నిర్థారణ జరిగింది. తను తీపి పదార్ధాల జోలికి పోనని, తమ వంశంలో ఎవరికీ డయాబెటిస్ లేదని ఆమె తెలిపింది. తన రక్తంలో చక్కెర శాతం ఎక్కువుందని వైద్యులు చెప్పే సరికి తట్టుకోలేకపోయానని, కాని తాను ఉండవలసిన బరువు కన్నా అధికంగా ఉన్నానని బిందు వివరించింది. కేరళలో అక్షరాస్యత వల్ల అధికంగా ప్రజలు పరీక్షలు చేయించుకోవడంతో మధుమేహం వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. గురువారం కెనడాలో జరిగిన ప్రపంచ మధుమేహ సదస్సులో మధుమేహ రోగానికి భారత్ కేంద్రమైందని ప్రకటించింది. భారత్ కు ఈ ఖ్యాతి రావడానికి కేరళ తన వంతు సాయం చేసిందనే భావించాలి!
News Posted: 31 October, 2009
|