పిల్లలే ఆనందం లండన్ :'పెళ్ళి చేసుకొని, ఇల్లు కట్టుకొని చల్లగ కాలం గడపాలోయ్! ఎల్లరు సుఖముగా ఉండాలోయ్' అని ఓ సినీ కవి సంసారాభిమానులకు ఎప్పుడో హితబోధ చేశారు. ఇంతా చేసి... మన వాళ్ళు కడుపు కట్టుకొని పిల్లల కోసం నానా అగచాట్లు పడటం మనకు తెలిసిందే. దాంపత్య జీవితంలో అమితంగా ఆనందాన్ని ఇచ్చేది - సంతానమేనని ఒక అధ్యయనంలో తేలింది. అధిక సంతానం వల్ల సంసారంలో ఆనందం ఉండదని, కొంత మందికి మాత్రమే హాయిగా ఉండొచ్చని ఇంతకు ముందు జరిగిన సర్వేలో ఫలితాలు వచ్చాయి. దీనికి భిన్నంగా అధిక సంతానంలో పిల్లలు ఎక్కువగా శ్రమిస్తారని, కొన్ని సందర్భాల్లోనే సంతోషం ఉంటుందని కొత్త సర్వే తెలిపింది. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన గ్లాస్ గో యూనివర్శిటీకి చెందిన లూయీస్ ఏంజెల్స్ మాత్రం ఈ వివరణ సబబుగా ఉందని అభిప్రాయపడ్డారు. అనేకమంది దంపతులను తమ జీవితాల్లో ఆనందం కలిగించిన సంఘటనలు, అధిక ప్రాధాన్యత ఉన్న అంశాల గురించి ప్రశ్నించగా... వారంతా కూడా తమ సంతానానికే పెద్దపీట వేశారు.
వివాహితల్లో - వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా తమ సంతోషానికి పిల్లలే కారణమని వివరించారు. అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నా కూడా తమ ఆనందానికి లోటు లేదన్నారు. విడాకులు పొందిన దంపతులు మాత్రం అధిక సంతానం పట్ల వ్యతిరేక భావాలను వ్యక్తం చేశారు. పిల్లలు సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందడం ద్వారా, ఖాళీ సమయాల్లో తల్లితండ్రులతో గడపడం వల్ల ఆనందాన్ని ఇస్తారని అంచనా. ఈ మేరకు ఆనందం గురించిన అధ్యయనం 'స్ర్పింజల్స్' పత్రికలో ప్రచురితమైంది.
News Posted: 31 October, 2009
|