బిడ్డను అద్దెకిచ్చిన ఆయా బెంగళూరు : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు... దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులు. తమ చిన్నారి బాబును కంటికి రెప్పలా కాపాడుతుందని భావించి నెల జీతం ఇచ్చి ఆయాను పెట్టారు. ఇటు జీతం దక్కుతుంది...అటు వ్యాపారం సాగిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది ఆ ఆయా... ఆ ఏడు నెలల బాలుడిని వీధుల్లో అడుక్కునే వాళ్ళకు అద్దెకు ఇచ్చేసింది. ఉదయం తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రం చెప్పిన సమయానికి పిల్లాడిని ఠంఛనుగా తెచ్చి అప్పగించే ఒప్పందం మీద రోజుకు వంద రూపాయల అద్దెకు బిచ్చగాళ్లు ఆ పిల్లాడిని ప్రతీ రోజూ తీసుకుపోయేవారు.
ఎంబియే గ్రాడ్యుయేట్ అయిన అనామిక జోషి ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు అనుకోకుండా పెందలాడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన అనామికకు కులాసాగా సోఫాలో కూర్చుని టెలివిజన్ చూస్తున్న ఆయా కనిపించింది. ఎంత వెతికినా ఏడు నెలల కొడుకు కనిపించలేదు. అనామిక భయంతో ఆయాను నిలదీసేసరికి అసలు సంగతి బయటపడింది. మూడు వారాలుగా తాను పిల్లాడిని బిచ్చగాళ్లకు అద్దెకు ఇస్తున్నానని ఆయా ఒప్పేసుకుంది. 'నా పిల్లాడికి పట్టిన గతిని తలచుకునే సరికి నా వెన్నులో వణుకుపుట్టిందని, తాను అదృష్టవశాత్తూ ముందుగా ఇంటికి రాకపోతే జరిగే పరిణామాలను తలచుకుంటేనే భయం వేస్తోంద 'ని అనామిక వాపోయింది.
ప్రతీ రోజూ తాము ఇంటికి వచ్చే సరికి పిల్లాడు మత్తుగా జోగుతూ ఉండే సంగతి ఆ భార్యభర్తలకు గుర్తొచ్చింది. సంగతి బయటపడగానే పిల్లాడిని వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళారు. ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని వైద్యులు ధైర్యం చెప్పారు. బిచ్చగాళ్లు పిల్లాడిని బయటకు తీసుకువెళ్లిన తరువాత ఏడవకుండా ఉండటానికి మత్తు మందు ఇచ్చేవారని తమకు తరువాత తెలిసిందని అనామిక వివరించింది. ఆయాను తరిమేసిన ఆ దంపతులు పోలీసు కేసు పెట్టలేదు. కాని పిల్లాడి పెంపకాన్ని మాత్రం తమ తల్లితండ్రులకు అప్పగించారు. ఇలాంటి నేరస్తులకు కఠిన శిక్షలు వేసే అవకాశం మన చట్టాల్లో లేవని, నగరాల్లో ఇలాంటి ఉదంతాలు చాలా సాధారణని, ఉద్యోగస్తులైన తల్లితండ్రులు జగ్రత్తగా ఉండాలని శిశు హక్కుల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
News Posted: 4 November, 2009
|