'నైట్ డ్యూటీ'కి కాఫీ శత్రువు టొరొంటో : రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు నిద్రా దేవత భారీ నుంచి తప్పించుకునేందుకు కాఫీ, టీ వంటి ఉష్ణ 'ద్రవా'లను ఆశ్రయించడం మామూలే! ఇంకొందరు 'ధూమ' యజ్ఞం... బీడీ, సిగరెట్లను కాల్చడం ద్వారా నిద్రకు దూరమౌతారు. ధూమపాన ప్రియుల సంగతెలా ఉన్నా.. వేడి 'నీరు' ప్రియులు మాత్రం తమకు నిద్ర సరిగా పట్టాలని భావిస్తే కాఫీకి వీడ్కోలు పలకాల్సిందేనట! మాంట్రెల్ యూనివర్శిటీలో సైకాలజీ ప్రొఫెసర్ జూలీ కెరియర్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు మాత్రం ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి.
కాఫీలో ఉండే కేఫిన్ అనే పదార్థం నిద్ర చెడగొట్టడమే కాకుండా నడికారులోని వారిపై ఇతర దుష్ఫలితాలు కూడా చూపుతుందని సైన్స్ డైలీ వెబ్ సైట్ పేర్కొంది. 'కెఫిన్ - నిద్రను భంగం చేయడానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అంతే కాకుండా, నైట్ డ్యూటీ చేసే ఉద్యోగుల్లో ఇతర హానికారక ఫలితాలు చూపుతుంది. పగలు గాఢనిద్ర పోయే వీరిలో కేఫీన్ వల్ల కలత నిద్ర పెరుగుతుంది' అని కెరియర్ వివరించారు. నిద్రా భంగంతో పాటు వయసు పెరిగినట్లు కూడా కనిపిస్తుందన్నారు. కెరియర్ నిర్వహించిన అధ్యయనంలో 24 మంది స్త్రీ, పురుషులు పాల్గొన్నారు. 20-30 ఏళ్ళలో వారిని ఒక విభాగంలో, 45-60 ఏళ్ల లోపు వారిని మరో విభాగంలో ఉంచారు. వీరంతా కూడా నిద్రకు ఉపక్రమించేముందు ప్రయోగశాలలో రెండో నిద్ర లేని రాత్రిళ్ళు గడిపారు. 'కాఫీ తాగిన తరువాత కొంతమంది పసి పిల్లల్లా కునికిపాట్లు పడ్డారు. ఆ సంగతిని వారు కూడా గుర్తించలేదు. వారుగ గాఢనిద్ర పోలేదు. కానీ కలతనిద్ర పోయారు' అని వివరించారు.
ప్రయోగంలో పాల్గొన్న రెండు వయోవర్గాల్లో నిద్ర పోయే మూడు గంటల ముందుగా 200 మిల్లీ గ్రాముల కెఫీన్ మాత్రం లేదా లాక్టోజ్ మాత్రను ఇచ్చారు. కెపిన్ మాత్రలు వాడినవారిలో నిద్రాభంగం ఎక్కువగా కనిపించింది. వయసు ఎక్కువ ఉన్నవారిలో ఇది మరీ ఎక్కువగా కనిపిచింది. ఈ ఫలితాల ఆధారంగా రాత్రివేళ విధులు నిర్వర్తించే వారిలో ముఖ్యంగా 40 ఏళ్ళు పైబడిన వారిలో కేఫిన్ ప్రభావం అధికంగా కనిపించిందని కెరియర్ తన అధ్యయనంలో కనుగొన్నారు. అందులోనూ కార్యాలయాల్లో రాత్రిపూట విధుల్లో పాల్గొనే సిబ్బంది కాఫీ వినియోగాన్ని తగ్గిస్తేనే నిద్రను మెరుగుపరచుకుంటారని చెబుతున్నారు. ఈ మేరకు అధ్యయన ఫలితాలు జర్నల్ 'స్లీప్ మెడిసిన్'లో ప్రచురితం అయ్యాయి.
News Posted: 6 November, 2009
|