ఎగతాళి చేస్తారేమోనని... చెన్నై : లేటు వయస్సులో మరొకసారి తండ్రివయ్యావని మిత్రులు, బంధువులు ఎగతాళి చేస్తారేమోనని భయపడిన ఒక మధ్య వయస్కుడు పుట్టిన కొడుకును కాలవలోకి విసిరేశాడు. కానీ ఆ నవజాత శిశువు వర్షపు రాత్రిలో చెక్కుచెదరకుండా బతికిబయటపడ్డాడు. తమిళనాడులోని తిరువారూరు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల రైతు ఎం. నాగూర్ మీరాన్ అప్పటికే తాత కూడా అయ్యాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె (18) వివాహిత. ఆమె ఒక బిడ్డకు తల్లి కూడా. అయితే నాగూర్ మీరాన్ భార్య 37 సంవత్సరాల రాణి మళ్ళి గర్భవతైంది. చెన్నైకి సుమారు 350 కిలో మీటర్ల దూరంలోని మంజకొల్లై గ్రామంలోని తమ ఇంటిలో బుధవారం (4న) రాత్రి ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డను తీసుకెళ్ళి నాగూర్ ఒక పంట కాలవలో పడేశాడు.
తాను 'మృతశిశువు'ను ఖననం చేసినట్లు చెబుతూ నాగూర్ మీరాన్ గురువారం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కాని పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించిన మీదట అతను నిజం ఒప్పుకున్నాడు. 'నేను ఇప్పటికే తాతనయ్యాను కనుక జీవితంలో ఈ దశలో ఒక శిశువుకు తండ్రివయ్యావా అని స్నేహితులు, బంధువుల ఎగతాళి నుంచి తప్పించుకోవాలని అనుకున్నాను' అని అతను పోలీసులతో చెప్పాడ నవజాత శిశువు చిన్న గాయం కూడా లేకుండా సజీవంగా ఉండడం చూసి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. 'బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భగవంతుని కరుణ వల్లే ఆ బిడ్డ సజీవంగా ఉన్నాడు' అని పోలీస్ ఇన్ స్పెక్టర్ పి. రాజశేఖర్ పేర్కొన్నారు.
News Posted: 6 November, 2009
|