వాషింగ్టన్ : 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్... ఓడి పోలేదోయ్' అనుకుంటూ... 'విజయానికి తొలిమెట్టు - అపజయం' అనుకుంటాం... దండయాత్రలు చేసీ.. చేసీ విజయానికి బాటలు వేసుకోవచ్చునని... వరుస వైఫల్యాల నుంచి... కసి పెరిగి విజయాన్ని సాధించడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని నమ్ముతాం. గోడకు కొట్టిన బంతిలా విజయాన్ని సొంతం చేసుకుంటామని అంటుంటాం!
కానీ... వైఫల్యాల నుంచి గుణ'పాఠాల'ను మెదడు స్వీకరించదని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. మసాచూ సెట్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ పరిశోధకుల ప్రకారం 'వైఫల్యాల కన్నా - విజయాలే మెదడును విశేషంగా ప్రభావితం చేస్తాయి. వ్యతిరేక లేక విరుద్ధ ఫలితాల నుంచి పాఠాలను మెదడు స్వీకరించదు' అని చెప్పారు. 'సైంటిఫిక్ అమెరికన్' జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం న్యూరో సైంటిస్ట్ ఎర్ల మిల్లర్ రెండు కోతులకు శిక్షణ ఇచ్చాడు. వీటికి రెండు దృశ్యాలను లక్ష్యంగా ఇవ్వడం ద్వారా 'ఓటమి' లేదా తప్పుల పట్ల వాటిలో మార్పుల్నీ పరిశీలించారు.
'ఒకసారి సరైన సమాధానం గుర్తించిన కోతి - తరువాత ప్రయోగంలో కూడా సత్ఫలితాలే సాధించింది. ప్రయోగంలో తప్పు చేసిన కోతికి... మరోసారి లక్ష్యాన్ని నిర్దేశించిన తరువాత కుడా అదే తప్పును చేశాయి. తప్పుల నుంచి పాఠం నేర్చిన దాఖలా కనిపించలేదు' అని అధ్యయన వేత్తలు వివరించారు. ఈ ఫలితాలను దైనందిన జీవితాలకు అన్వయించవచ్చునని పేర్కొంటున్నారు. ఎవరైనా విజయం నుంచే మరింత ఉత్తేజాన్ని పొందుతారని తెలిపారు.