జుట్టా? మజాకా?? రాయ్ పూర్ : సాధ్యం కాని కష్టమైన పనిని చేయడానికి సిద్ధపడిపోయిన వాడిని నువ్వీ పని చేయగలవా అని ప్రశ్నిస్తే 'చూద్దాం. కొండకు ఈక కట్టాను. వస్తే కొండ వస్తాది. పోతే ఈక పోతాది' అని సమాధానం చెబుతాడు. వెంట్రుకంటే అంత లోకువ మరి. కానీ పర్మినెంటుగా జుట్టూడిపోయిన బట్టతలపై సిలికాన్ ట్రీట్ మెంటు, ట్రాన్స్ ప్లాంటేషన్ వగైరాలు లేకుండా కోటి రూపాయలిచ్చినా కొత్తగా ఒక ఈకను కూడా మొలిపించే మొనగాడు భూప్రపంచం మీదే లేడు. కాబట్టి వెంట్రుకను తేలిగ్గా చూడకూడదన్నమాట. కొండ ఈవాళ కదలకపోతే రేపు కదలుతాది. కానీ ఈక పోతే మరి మొలవదు. ఈ నిజాన్ని గ్రహించింది కనుకే ఆ అమ్మణ్ణి కడుపు మండిపోయి మరీ కోర్టుకెక్కింది. బారెడు జుట్టును జానెడు చేసిన బ్యూటీ పార్లర్ యజమాని ముక్కుపిండి మరీ కాసులు వసూలు చేసింది.
ఛత్తీస్ ఘఢ్ లోని రాయ్ పూర్ లో గృహిణి స్మితా సింగ్ కు ముప్పైమూడేళ్ళు. ఈమధ్య ఆమె అక్కడ పేరుమోసిన బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. తన పొడవైన అందమైన కురులను మరింత అందంగా తీర్చిదిద్దటం కోసం చివరలను కొద్దిగా కత్తిరించమంది. కళ్లుమూసుకుని కుర్చీలో విశ్రాంతిగా కూర్చుంది. హెయిర్ డ్రెస్సర్ తనపని తాను చేసుకుపోయింది. కళ్లు తెరిచి తన జుట్టును చూసుకున్న స్మిత కెవ్వున కేకేసింది. నాగుపాములా, కృష్ణానదిలా పొడవుగా ఉండే తన కురులను కురచగా తెగ్గోట్టేయడం చూసి గగ్గోలు పెట్టేసింది.అంతే తనకు జరిగిన అన్యాయంపై కేసు వేసింది. కే లీ కెంట్స్ స్లిమ్మింగ్ అండ్ బ్యూటీ క్లీనిక్ అని పొడవైన పేరు గల బ్యూటీ పార్లర్లో తన జుట్టు పొట్టిగా అయిపోయిందని, తాను ఒకటిన్నర అంగుళాలు కత్తిరించమంటే పది అంగుళాల జుట్టును తీసేశారని స్మిత నిరూపించేసింది. దాంతో ఆమెకు నష్టపరిహారంగా మూడు వేల రూపాయలు చెల్లించి కోర్టు ఖర్చులు కింద వెయ్యి రూపాయలు కూడా భరించాలని సదరు బ్యూటీ పార్లర్ ను కోర్టు ఆదేశించింది. అంతేనా స్మత దగ్గర నుంచి ఫీజుగా తీసుకున్న మూడు వందల రూపాయలు కూడా తిరిగి ఇచ్చేయాలని కోర్టు పేర్కొంది. ఆమె అందాన్ని చెడగొట్టడం సేవాలోపం కిందకు వస్తుందని, వినియోగదారుని కోరిక మేరకు కాకుండా ఎక్కువ జుట్టు కత్తిరించడం నిర్లక్ష్యంగా సేవలందించడమేనని కోర్టు పేర్కోంది.
News Posted: 6 November, 2009
|